పేదలకు సేవ దృక్పథంతో సహాయం చేయడం అభినందనీయం: ఎమ్మెల్యే

by Kodari Anjali |

ఫాదర్స్ డే సందర్భంగా ‘గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్’ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఉచిత వైద్య శిబిరం, నిత్యావసరాల పంపిణీ చేశారు.

పేదలకు సేవ దృక్పథంతో సహాయం చేయడం అభినందనీయం: ఎమ్మెల్యే
X

దిశ, ఏన్కూర్: సమాజంలో నిరుపేదలకు, గిరిజనులకు వైద్య సేవలతో పాటు నిత్యావసరాలు అందిస్తూ ఆదుకోవడం అభినందనీయమని వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఫాదర్స్ డేను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలోని గాయత్రి హాస్పిటల్ ఆవరణలో ‘గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్’ అధినేత, ప్రముఖ గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్-రాజేశ్వరి దంపతులు తమ తండ్రి దివంగత కొలిశెట్టి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గిరిజనులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త మేడిపల్లి గిరిజన గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గిరిజన పిల్లల విద్యాభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి నూతన పాఠశాలను ఏర్పాటు చేయిస్తామని, ఇప్పటికీ చీకటిలో మగ్గుతున్న ఆ గ్రామానికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ప్రకటించారు.

ఈ ఉచిత శిబిరంలో వందలాది మంది రోగులకు..

ఎంతో ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తూ నిత్యం సేవానిరతిని చాటుకుంటున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ సేవలను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత కొలిశెట్టి నరేష్ మాట్లాడుతూ.. తన తండ్రి జ్ఞాపకార్థం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉచిత శిబిరంలో వందలాది మంది రోగులకు డాక్టర్ ఆసిఫ్ అలీ, కొలిశెట్టి నరేష్, ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ జైపాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తంబళ్ల సామేలు, ఏన్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు స్వర్ణ నరేందర్, ఏన్కూర్ మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, ముళ్లపాటి సీతారాములు చింతనబోయిన సీతారాములు, నరేష్ జాదవ్, నాగరాజు, చందమామ నరసింహ రావు సుంకర వెంకట నర్సయ్య, గుమ్మా రోశయ్య, గోవిందు వెంకటేశ్వర్లు పంతగాని నరేష్,సాయి రోహిత్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు తదితర స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story