- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబ్జాదారుల కోరల్లో చిరతనాల చెరువు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పుల్లాయిగూడెం గ్రామంలో ఉన్న యానంబైల్ రెవిన్యూ పరిధిలో ఉన్నటువంటి ఉప్పలకుంటచెరువు ఆక్రమణల బారినపడి అస్తిత్వాన్ని కోల్పోతున్న దుస్థితి నెలకొంది.

దిశ, పాల్వంచ: టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పుల్లాయిగూడెం గ్రామంలో ఉన్న యానంబైల్ రెవిన్యూ పరిధిలో ఉన్నటువంటి ఉప్పలకుంట (చిరతనాల)చెరువు ఆక్రమణల బారినపడి అస్తిత్వాన్ని కోల్పోతున్న దుస్థితి నెలకొంది. ఒకప్పుడు 41 ఎకరాల విస్తీర్ణంలో గ్రామానికి జీవనాడిగా నిలిచిన ఈ జలవనరు ప్రస్తుతం కేవలం 6 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు ఆధారంగా నిలవాల్సిన చెరువు భూములు క్రమంగా కబ్జాలకు గురై పామాయిల్ తోటలుగా మారిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చెరువు శిఖం భూములను కొందరు వ్యక్తులు దశలవారీగా ఆక్రమించుకుని మట్టి నింపి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు.
చెరువు ప్రాంతంలో మట్టి నింపి..
ఇప్పటికే పలువురు ఆక్రమణదారులు పామాయిల్ సాగు చేస్తుండగా, వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింత మంది అదే బాట పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “వాళ్లు ఆక్రమించారు.. ఎవరూ అడగలేదు.. మరి మమ్మల్ని ఎవరు ఆపుతారు?” అన్న ధైర్యంతో చెరువు భూములపై యథేచ్ఛగా కబ్జాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి వేళల్లో జేసీబీల సహాయంతో చెరువు ప్రాంతంలో మట్టి నింపి భూమిని చదును చేసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయమో, అధికారుల కంటపడకుండా చేయాలనే ఉద్దేశమో తెలియదు గానీ రాత్రివేళ భారీ యంత్రాలతో పనులు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా జలవనరులో బహిరంగంగా పనులు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు కారణమవుతోంది.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆక్రమణలు..
గ్రామస్తులను వేధించడంలో, చిన్నచిన్న భూ వివాదాల్లో వెంటనే స్పందించే అధికారులు చెరువు ఆక్రమణల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒకప్పుడు 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 6 ఎకరాలకు కుదించబడిందంటే మిగిలిన 35 ఎకరాలు ఎక్కడికి వెళ్లాయని ప్రజలు నిలదీస్తున్నారు. ఇది ఒక్కరోజులో జరిగిన వ్యవహారం కాదని, ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆక్రమణల ఫలితమేనని చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా నమోదైన భూమిని ఆక్రమించి పామాయిల్ తోటలు సాగు చేయడం, మట్టి నింపివేయడం, భూమిని చదును చేయడం వంటి పనులు జరుగుతున్నా చర్యలు లేకపోవడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా..? లేక కొందరి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పటికైనా స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
చెరువు భూములను ఆక్రమించి..
చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలు మాత్రమే కాదని, గ్రామీణ వ్యవసాయానికి జీవనాధారమని రైతులు గుర్తుచేస్తున్నారు. వర్షాకాలంలో నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంచే చెరువులు క్రమంగా ఆక్రమణలకు గురైతే రానున్న రోజుల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు. నేడు చెరువును కాపాడకపోతే రేపు గ్రామ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరతనాల చెరువు అసలు విస్తీర్ణం, శిఖం భూములను గుర్తిస్తూ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు భూములను ఆక్రమించి పామాయిల్ తోటలు సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాత్రివేళ మట్టి నింపివేతలకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే “ఉప్పలకుంట (చిరతనాల)చెరువు” అనే పేరు మాత్రమే మిగిలి, చెరువు పూర్తిగా చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.






