సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలి : డీఎస్పీ అశోక్

by Ratna Kumari |

దిశ, కొత్తగూడెం : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సైబర్ క్రైమ్స్

సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలి : డీఎస్పీ అశోక్
X

దిశ, కొత్తగూడెం : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సైబర్ క్రైమ్స్ డీఎస్పీ అశోక్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భరోసా బృందం, సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారులు సంయుక్తంగా సుజాతనగర్‌ లోని శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో లైంగిక వేధింపులు, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అశోక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఖాతాలు, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, ఫోటోలు-వీడియోల మార్పు చేయడం (మార్ఫింగ్), మహిళలు, చిన్నారులపై ఆన్‌లైన్ లైంగిక నేరాలు వంటి అంశాలపై వివరించారు. వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో లేదా అసురక్షిత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ ప్రొఫైల్ మోసాలు, డిజిటల్ వేదికల్లో తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లైంగిక దాడులు, వేధింపులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం అందించే సేవలను గురించి వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వలన కలిగే శారీరక,మానసిక,సామాజిక ఆర్థిక సమస్యలను వివిధ ఉదాహరణలతో వివరించారు. భరోసా కేంద్రం స్థాపన అవసరాన్ని, అందించే సేవలను మరియు పిల్లల రక్షణ కోసం అమలు చేసే పొక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. యువత,మహిళలు సైబర్ వాతావరణంలో సురక్షితంగా ఉండేందుకు, జరిగే ఏవైనా వేధింపులను నిర్భయంగా ఆవిష్కరించి సహాయం పొందేందుకు అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ బి.అశోక్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ సీఐ ఎస్.జితేందర్, భరోసా ఇన్‌స్పెక్టర్ బి.రాము, భరోసా ఎస్సై అరుణ, భరోసా కో-ఆర్డినేటర్ రేణుక, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

Next Story