- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసైన్డ్ భూముల అన్యాక్రాంతం..సర్వేనెంబర్ 817లో విచ్చలవిడి నిర్మాణాలు
పాల్వంచ పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. 817సర్వేనెంబర్ అసైన్డ్ భూమి సుమారు 3వేల ఎకరాల విస్తీర్ణంతో ఈ సర్వే నెంబర్ అక్రమార్కులకు చుట్టంగా మారింది.

దిశ, పాల్వంచ: పాల్వంచ పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. 817సర్వేనెంబర్ అసైన్డ్ భూమి సుమారు 3వేల ఎకరాల విస్తీర్ణంతో ఈ సర్వే నెంబర్ అక్రమార్కులకు చుట్టంగా మారింది. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలో కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించి, భూదోపిడికి తెరలేపారు. ఓ వెంచర్ స్థాయిలో భారీ కట్టడాలకు శ్రీకారం చుట్టారు. విచ్చలవిడిగా చేపట్టిన నిర్మాణాలపై రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ దృష్టికి సమస్య తీసుకెళ్లినప్పటికీ.. స్పందించకపోవడం గమనార్హం. సమాచారం కోరేందుకు జర్నలిస్టులు ప్రయత్నం చేసినా.. కాలయాపనతో రెవెన్యూ యంత్రాంగం దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
817లో వాలిన భూ గద్దలు
రియల్ ఎస్టేట్ పేరుతో ఈ భూమిపై కొందరు కన్నేశారు. బాహాటంగా భూ ఆక్రమణకు పాల్పడి, వెంచర్ తరహాలో కోట్ల వ్యాపారం చేపట్టారు. ఈ ఘటనపై గతంలో వివాదం చెలరేగింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ ప్రాంతంలో కొంత భూమిని కొనుక్కుని, రేకుల షెడ్డు నిర్మించుకున్న నేపథ్యంలో రియల్ వ్యాపారి అనుచరులు కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు శాసనసభ్యులు కూనంనేని దృష్టికి సమస్య తీసుకెళ్లారు. గొడవ నేపథ్యంలో పోలీసులు వ్యాపారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా రెవెన్యూ యంత్రాంగం నుంచి స్పందన కరువైంది. అసైన్డ్ భూమా? లేక పట్టానా అనేది తేల్చక అధికారి యంత్రంగం చేతులు ముడుచుకుని కూర్చోవడంతో, ఆ వివాదం పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
భారీ మొత్తంలో చేతులు మారాయా?
817 వివాదాస్పద భూమిలో అధికార వర్గాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పాల్వంచలో అక్రమ భూ లావాదేవీలకు కొదవలేదు. ఓకే టీపీఎస్ ఏడీఈ స్థాయి అధికారి భూమిని ఆక్రమించి, దర్జాగా భారీ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో పలువురు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు దృష్టి సారించి, చెక్ పెట్టేలా చర్యలకుప్రక్రమించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చాయి
రవిరెడ్డి, పాల్వంచ పట్టణ ఆర్ఐ
817సర్వే నెంబర్‌లో జరుగుతున్న అక్రమ కట్టడాలు మా దృష్టికి వచ్చాయి. మేము వాటికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాం. అక్రమ కట్టడాలు ఏమైనా జరిగితే వారు చర్యలు తీసుకుంటారు. మేము కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి విచారణ చేపట్టి, అనంతరం ప్రభుత్వ భూమిలో నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.






