విద్యార్థులు సాధించిన ఏ విజయమైనా మన దేశ సంపదే

by Taduka Kalyani |   (  Updated:2025-01-11 15:54:03  IST  )

విద్యార్థులు సాధించిన ఏ విజయమైన మన దేశ సంపదేనని కాళోజీ అవార్డు గ్రహీత, సాహితీవేత్త, కవి, విమర్శకులు డాక్టర్ రావులపాటి సీతారాం అన్నారు

విద్యార్థులు  సాధించిన ఏ విజయమైనా మన దేశ సంపదే
X

దిశ, వైరా : విద్యార్థులు సాధించిన ఏ విజయమైన మన దేశ సంపదేనని కాళోజీ అవార్డు గ్రహీత, సాహితీవేత్త, కవి, విమర్శకులు డాక్టర్ రావులపాటి సీతారాం అన్నారు. వైరాలోని లయన్ విద్యానగర్ లో ఉన్న న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను సీతారాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరావు అధ్యక్షతన జరిగిన సభలో సీతారాం ప్రసంగించారు. ఏ విద్యాసంస్థ నుండి ర్యాంకులు సాధించినా అది దేశ సంపదగా భావించాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ ప్రవేశపెట్టిన నివేదిక చాలా గొప్పగా ఉన్నదని కొనియాడారు. ఎన్ సి సి , యోగా, కరాటే, డ్యాన్స్ వ్యాసరచన, వకృత్వత్వం పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెల్చుకోవటం అభినందనీయం అన్నారు. పాఠశాల పై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విశ్వాసం, గౌరవం ఉండాలని చెప్పారు.

బోధనలో, విద్యార్ధిని తీర్చి దిద్దడం లో ఎంత శ్రమ ఉందో గ్రహించాలన్నారు. విద్యార్ధుల పట్ల ప్రతి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండి తీరాలన్నారు. రేపు వివేకానందుడి జన్మదినం అని గుర్తు చేశారు. ఆయన నుండి నేటి విద్యార్ధి,యువత ఎంతో నేర్చుకోవాలన్నారు. ఆయన అంతర్జాతీయ వేదికలపై సాహిత్యం, విద్యా ఆవశ్యకతను చెప్పారన్నారు. తాత్కాలిక ఫలితాల కన్నా శాశ్వత విజయాల వైపు విద్యార్ధులను నడపాలని, అందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు నిరంతరం శ్రమించాలని సీతారాం విజ్ఞప్తి చేశారు. కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వర్ రావు మాట్లాడుతూ… న్యూ లిటిల్ ఫ్లవర్ ప్రారంభమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతంలోకి అడుగిడుతున్న క్రమంలో తలిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులు చూపించిన ఆదర అభిమానాలు సహాయ సహకారాలు మరవలేనివన్నారు.

అదే విధంగా పిల్లలను అన్ని రంగాలలో ప్రతిభ కనబర్చే విధంగా మా అకడమిక్ ప్రోగ్రామ్ ను ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్తూ మెరుగైన ఫలితాలను సాదిస్తున్నామన్నారు. 10వ తరగతి ఫలితాల్లోనూ, (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించే మెయిన్స్, నీట్, ఈ ఏ పి సి ఈ టి ఫలితాల్లో మా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఎన్ సి సి కి కుడా ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వటం తో విద్యార్థులు విద్యా, ఉద్యోగ రంగాల్లో మరింత ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాపా మురళీకృష్ణ ,కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకర్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఎ.ఓ సామినేని నరసింహారావు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story