నానో యూరియాతో ఖర్చు తక్కువ... ప్రయోజనం ఎక్కువ

by velandi.Saikiran |

లిక్విడ్ రూపంలో ఉన్న నానో యూరియా, డీఏపీలను రైతులందరూ వినియోగించుకోవాలని పినపాక వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి.తాతారావు

నానో యూరియాతో ఖర్చు తక్కువ... ప్రయోజనం ఎక్కువ
X

దిశ, బూర్గంపాడు: పంట పొలాలకు ఎరువుల వినియోగాన్ని దశల వారీగా తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపట్టింది.సారవంతమైన భూముల స్వభావం దెబ్బతినకుండా ఉండేందుకు,కాలుష్యం లేకుండా మార్పులు చేపడుతోంది.అందులో భాగంగా చిన్నచిన్న గుళికల రూపంలో ఉండే యూరియా స్థానంలో లిక్విడ్ నానో యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీని వినియోగంతో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా అధిక దిగుబడికి దోహదపడుతుంది.ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లాలోని 23 మండలాల్లో సాగు విస్తీర్ణం 6,03,124 ఎకరాలు.ఉద్యాన తోటలు మినహా ఈ ఖరీఫ్ లో 4,72,559 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా.వరి 1,65,956 ఎకరాలు,పత్తి 2,04,632 ఎకరాలు మొక్కజొన్న 86,544 ఎకరాలు, మిరప 10,489 ఎకరాలు,వేరుశనగ 2,791 ఎకరాలు, కందులు 1,159 ఎకరాలు,మినుములు 857, పెసలు 131 ఎకరాల్లో సాగు చేయనున్నారు.

రైతులు ఎరువుల వినియోగానికి,కూలీలకు అధిక మొత్తంలో పెట్టుబడులు వెచ్చిస్తున్నారు.ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం నానో యూరియా,డీఏపీని లిక్విడ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.రెండేళ్ల ముందు మార్కెట్లోకి విడుదల చేయగా జిల్లాలో రైతులు పది శాతం కూడా వినియోగించడం లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది.సాధారణంగా ఎకరం పంటకు 2 నుంచి 3 బస్తాల యూరియాను ఉపయోగిస్తున్నారు.ఒక బస్తా కేవలం 35 శాతం పంటకు మాత్రమే వస్తుంది.అదే నానో యూరియా అరలీటరుతో ఎకరం పంట సాగు చేసుకోవచ్చని,80శాతం పంటకు అందుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

రైతులందరూ వినియోగించాలి-ఏడీఏ

లిక్విడ్ రూపంలో ఉన్న నానో యూరియా, డీఏపీలను రైతులందరూ వినియోగించుకోవాలని పినపాక వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి.తాతారావు తెలిపారు.వీటి వాడకంతో రైతుకు ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని రైతులు సాగు దిగుబడులు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

Next Story