‘లెక్కలేని’తనం? ఉమ్మడి జిల్లాలో రవాణాశాఖ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు

by Ajay Maddhiboyina |

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందనే సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీ చేశారు.

‘లెక్కలేని’తనం? ఉమ్మడి జిల్లాలో రవాణాశాఖ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందనే సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పెద్దఎత్తున లెక్కల్లో లేని నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అనధికార సిబ్బందిని సైతం గుర్తించి, పట్టుకున్నారు. ఆయా చెక్ పోస్టుల్లో కొందరు సిబ్బంది.. లెక్కలు రాయకుండ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అశ్వారావుపేటలో నిత్యం రూ.5లక్షల వరకు, పాల్వంచలో లక్ష వరకు అక్రమ వసూళ్లు ఉంటాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడి చేసి, అనధికార నగదు పట్టుకున్నా.. యాక్షన్ తీసుకోలేదని, ఇప్పుడు దొరికినా ఏమి కాదన్న ధీమాలో కొందరు రవాణా అధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. - దిశ ప్రతినిధి, కొత్తగూడెం

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు... అన్న చందంగా జిల్లా రవాణా శాఖలో అధికారుల తీరు ఉంది... 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అని పెద్దలు చెప్పిన మాటను వీళ్లు తూచా తప్పక పాటిస్తున్నారని చెప్పక తప్పదు... ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే అందిన కాడికి దోచుకుందాం లెక్కలు రాస్తే సర్కార్‌కు వెళుతుంది. అదే ఎలాంటి లెక్కలు లేకుండా ఉంటే మన ఖజానాకు చేరుతుంది అని అనుకున్నారో ఏమో కానీ అందినకాడికి దోచుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు. రవాణాశాఖలో కొందరు అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ శాఖపై గతంలోనూ ఏసీబీ అధికారులు దాడి చేసినా వారి ప్రవర్తనలు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

ఏసీబీ తనిఖీలు..

ఉమ్మడి జిల్లాలో రవాణాశాఖ చెక్ పోస్ట్‌లపై ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో లేని అనధికార నగదు పట్టుబడింది. అశ్వారావుపేట రవాణాశాఖ చెక్ పోస్ట్‌లో ముగ్గురు అనధికారిక సిబ్బందిని గుర్తించి పట్టుకున్నారు. అశ్వారావుపేటలో వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు జనార్దన్ రెడ్డి, పాల్వంచలో మనోహర్, ముత్తగూడెంలో విజయశాంతి డ్యూటీలో ఉండగా ఏసీబీ దాడులు జరిగాయి. అశ్వారావుపేటలో రోజు రూ.5లక్షల వరకు, పాల్వంచలో రోజు లక్ష వరకు అక్రమ వసూళ్లు ఉన్నాయని ఆరోపణలు లేకపోలేదు. దానికి తగ్గట్టుగానే లభించిన లెక్కల్లో లేని అక్రమ నగదును గుర్తించారు. టేబుల్ సోరుగులో డబ్బాలు పెట్టి వసూళ్లు చేసిన 100, 200, 500నోట్లు అరల్లో వేర్వేరుగా ఉండటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెక్ పోస్టులు ఎత్తివేసినా..

ప్రభుత్వం చెక్‌పోస్ట్‌లు ఎత్తి వేసినా చెక్ పోస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఏసీబీకి దొరికిన ఏమి కాదన్న ధీమాలో కొందరు రవాణా అధికారులు ఉన్నారు. గతంలో చెక్‌పోస్ట్‌లపై దాడి చేసి, అనధికార నగదు దొరికినా యాక్షన్ తీసుకోలేదు. దీంతో ప్రభుత్వంలో పైవారి ఆశీర్వాదం పుష్కలం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అశ్వారావుపేట చెకపోస్ట్‌లో గతంలో రూ.38వేల నగదు పట్టుకున్నారు. అప్పటి అధికారే ఈ రోజు డ్యూటీలో ఉన్నారు.. ఇప్పుడు పెద్ద ఎత్తున నగదు దొరికింది. ఇప్పటికైనా యాక్షన్ ఉంటుందా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Next Story