రైతు నేస్తం పేరుతో మొక్కుబడి తంతు..!

by Taduka Kalyani |

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం పాల్వంచ మండలంలో అధికారుల నిర్లక్ష్యానికి బలవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రైతు నేస్తం పేరుతో మొక్కుబడి తంతు..!
X

దిశ:పాల్వంచ టౌన్ ; రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పంటల యాజమాన్యం, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం పాల్వంచ మండలంలో అధికారుల నిర్లక్ష్యానికి బలవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, మంత్రులతో అనుసంధానం చేసి వ్యవసాయ రంగంలో నూతన మార్పులను పరిచయం చేయాల్సిన కార్యక్రమం క్షేత్రస్థాయిలో మాత్రం మొక్కుబడిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం పాల్వంచ మండలంలో 6,977 మంది పట్టాదారు రైతులు, 1,254 మంది పట్టాదారు పాస్‌బుక్ లేని రైతులు కలిపి మొత్తం 8,231 మంది రైతులు ఉన్నారు. వీరి ఆధీనంలో 24,652 ఎకరాల సాగుభూమి ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఉన్న మండలంలో రైతుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మండలంలో నాలుగు క్లస్టర్ల పరిధిలో రైతులను అనుసంధానం చేస్తూ రైతు వేదికలను ఏర్పాటు చేశారు. పాండురంగాపురం, పుల్లాయిగూడెం, జగన్నాథపురం ,బంజర రైతు వేదికలకు విద్యుత్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించి రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలు, పంటల నిర్వహణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాల్సి ఉంది.అయితే ప్రస్తుతం జగన్నాథపురం, పుల్లాయిగూడెం రైతు వేదికల్లో మాత్రమే రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

రైతు వేదికలు ప్రస్తుతం దొంగలకు అడ్డాలుగా మారాయా..?

పాండురంగాపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్, వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు దొంగల పాలవడంతో అక్కడ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన కీలక పరికరాలు మాయమైనా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.ఇక పుల్లాయిగూడెం రైతు వేదిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు ఫ్యాన్లు కూడా దొంగల పాలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవైపు వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, మరోవైపు ఫ్యాన్లు వరుసగా దొంగతనాలకు గురవుతుండటంతో రైతు వేదికలు వ్యవసాయ అవగాహన కేంద్రాలుగా కాకుండా అనాథ భవనాలుగా మారిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.“రైతులకు అవగాహన కల్పించాల్సిన రైతు వేదికలు ప్రస్తుతం దొంగలకు అడ్డాలుగా మారాయా..?” అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఆస్తులు వరుసగా దొంగల పాలవుతుంటే వాటి భద్రతపై సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే ఈ కార్యక్రమంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 8,231 మంది రైతులు ఉన్న మండలంలో రైతు నేస్తం కార్యక్రమానికి మొత్తం హాజరైనది కేవలం ఆరుగురు రైతులు మాత్రమే. వేలాది మంది రైతులు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆరుగురు మాత్రమే హాజరవడం వ్యవసాయ శాఖ పనితీరుపై తీవ్ర సందేహాలకు తావిస్తోంది.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుల్లాయిగూడెం రైతు వేదికలో ఒక్క రైతు కూడా హాజరు కాలేదని సమాచారం. రైతులకు కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

గ్రామాల్లో రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ సిబ్బందిపై ఉంటుంది. వాట్సాప్ గ్రూపులు, డప్పు చాటింపు, గ్రామ ప్రకటనలు, రైతు సంఘాల ద్వారా సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది రైతులకు అసలు కార్యక్రమం జరుగుతున్న విషయమే తెలియలేదని రైతులు చెబుతున్నారు.రైతులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా “ఈసారి సమాచారం ఇవ్వడం మర్చిపోయాం” అనే సమాధానం రావడం మరింత వివాదాస్పదంగా మారింది. వేలాది మంది రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాన్ని “మర్చిపోయాం” అనే ఒక్క మాటతో సమర్థించుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా రైతులు అభివర్ణిస్తున్నారు.“వేలాది మంది రైతులు ఉన్న మండలంలో రైతు నేస్తం కార్యక్రమానికి ఆరుగురు మాత్రమే హాజరవడం రైతుల నిరాసక్తత కాదు.. అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది” అని రైతులు మండిపడుతున్నారు.“రైతులను రైతు వేదికల వరకు తీసుకురాలేని అధికారులు వ్యవసాయాభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రైతులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించి, రైతులు రాలేదని చెప్పడం వైఫల్యాన్ని రైతులపై నెట్టే ప్రయత్నమే” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం కోట్ల రూపాయలతో రైతు వేదికలు నిర్మిస్తోంది.

వ్యవసాయ అవగాహన కేంద్రాలా..? లేక అనాథ భవనాలా..?”

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం రైతులను రప్పించడంలో, ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.“ఎల్ఈడీ స్క్రీన్లు, వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, నాలుగు ఫ్యాన్లు వరుసగా దొంగల పాలవుతుంటే రైతు వేదికలు వ్యవసాయ అవగాహన కేంద్రాలా..? లేక అనాథ భవనాలా..?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.“ప్రభుత్వ ఆస్తులను కాపాడలేని అధికారులు రైతుల భవిష్యత్తును ఎలా కాపాడగలరు..? రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు సమాచారం ఇవ్వడం మర్చిపోయామని చెప్పడం సిగ్గుచేటు” అని రైతులు మండిపడుతున్నారు.“రైతే రాజు” అని ప్రభుత్వం ప్రతి వేదికపై చెబుతోంది. కానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ నినాదం రైతుల జీవితాల్లో కాదు.. కేవలం ఫ్లెక్సీల్లో, సమావేశాల్లో, ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు వేదికల్లో దొంగతనాలు జరుగుతుండటం, రైతులకు సమాచారం అందకపోవడం, వేలాది మంది రైతులు ఉన్న మండలంలో ఆరుగురు మాత్రమే హాజరవడం వంటి పరిణామాలు వ్యవసాయ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతు నేస్తం కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, రైతు వేదికల్లో జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలు, రైతు నేస్తం కార్యక్రమాలు, “రైతే రాజు” నినాదం అన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజలు భావించే పరిస్థితి దూరంలో లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.

పాల్వంచ మండల వ్యవసాయ శాఖ అధికారి వివరణ : శంభోశంకర్

రైతు నేస్తం” కార్యక్రమం కొత్తది కాదని, ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా జరుగుతున్న కార్యక్రమమేనని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా కొత్తగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే రైతులకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. “ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. రైతులకు ముందే తెలుసు. వారు స్వయంగా హాజరవుతారు. మా ఏఈవో లు అందరూ ఏర్పాట్లు చూసుకుంటున్నారు” అని ఆయన వివరించారు.కార్యక్రమం నిర్వహణలో ఎటువంటి కొత్త నిర్ణయం లేదా మార్పు లేదని, సాధారణంగా కొనసాగుతున్న విధంగానే సమావేశాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రైతుల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Next Story