Delhi liquor scam వ్యవహారంలో నరాలు తెగే ఉత్కంఠ!

by GSrikanth |   (  Updated:2022-12-22 02:45:56  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి నిద్రపట్టకుండా చేస్తున్నది.

Delhi liquor scam వ్యవహారంలో నరాలు తెగే ఉత్కంఠ!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి నిద్రపట్టకుండా చేస్తున్నది. తమ పేర్లు ఎప్పుడు తెరపైకి వస్తాయోననే భయం వారిని వెంటాడుతున్నది. వచ్చేనెల 6వ తేదీ‌లోపు ఈడీ కామన్ చార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నందున.. అందులో కొత్తగా ఎవరి పేర్లు ఉండనున్నాయి? ఏయే ఆధారాలు పొందుపరిచారు? నెక్ట్ టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనూహ్య మలుపులు తిరుగుతున్నది. ఏకకాలంలో సీబీఐ, ఈడీలు దర్యాప్తు ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటికే ఫస్ట్ రౌండ్ చార్జిషీట్లను వేర్వేరుగా దాఖలు చేసిన సంస్థలు.. నిందితులు, సహ నిందితులు, అనుమానితుల నుంచి ఓరల్ స్టేట్‌మెంట్లను రికార్డు చేశాయి. వాటికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్సులను సైతం ఇప్పటికే ఈడీ సిద్ధం చేసినట్టు సమాచారం. జనవరి 6వ తేదీ లోపు మరో చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇది కామన్ చార్జిషీట్‌గా ఉంటుందని స్పెషల్ కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది ఎన్‌కే మట్టా మూడు రోజుల క్రితమే వివరించారు. ఈ కొత్త చార్జిషీట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి? ఎలాంటి లోతైన ఆధారాల ప్రస్తావన ఉంటుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. లిక్కర్ స్కామ్‌లో గతంలో అమిత్ అరోరా, తాజాగా సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్‌లోనూ, సీబీఐ దర్యాప్తులో అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా వాంగ్మూలంలోనూ తరచూ 'సౌత్ గ్రూపు' ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఈ గ్రూపును నియంత్రిస్తున్నట్టు గతంలో ఈడీ.. అమిత్ అరోరా రిమాండ్ డైరీ రిపోర్టులో కోర్టుకు తెలియజేసింది. తాజాగా సమీర్ మహేంద్రు విషయంలోనూ దాన్ని ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. తెలంగాణలో కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ సౌత్ గ్రూపును నియంత్రిస్తున్నారని ఈడీ పేర్కొన్న ముగ్గురిలో.. ఇద్దరు ప్రజా ప్రతినిధుల గురించి చర్చ నడుస్తున్నది.

క్రాస్ ఎగ్జామినేషన్..

వచ్చే నెల 6వ తేదీన లేదా ఆ లోపే స్పెషల్ కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేయనుంది. అందులో ఎలాంటి కొత్త విషయాలు వెలికి తీస్తుంది? సౌత్ గ్రూపునకు సంబంధించిన వివరాలను ఏ మేరకు ప్రస్తావిస్తుంది? అనేది కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఫైనలైజ్ కాకముందే రాజకీయ నాయకులు, అధికారులు, లిక్కర్ వ్యాపారుల మధ్య జరిగిన చర్చల గురించి ఇప్పటివరకూ ఓరల్ స్టేట్‌మెంట్ల రూపంలో వివరాలను తెలుసుకున్న ఈడీ.. వాటికి సంబంధించి లోతైన కసరత్తు జరిపి ఫైనాన్షియల్, టెక్నికల్ ఎవిడెన్సులను సిద్ధం చేసినట్టు ఆ శాఖ వర్గాల సమాచారం. మొదటి చార్జిషీట్ ఆధారంగా ట్రయల్ జరుగుతున్న క్రమంలోనే దర్యాప్తు కూడా కంటిన్యూ అవుతుందని ఆ వర్గాలు నొక్కిచెప్పాయి. అవసరమైన ఆధారాలను సేకరించడానికి, వివరాలను ధ్రువీకరించుకోడానికి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని, స్పెషల్ కోర్డు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ సంస్థల దర్యాప్తు వేర్వేరు అంశాలపై వేర్వేరుగా జరుగుతున్నప్పటికీ సమాచారాన్ని షేర్ చేసుకోడానికి, ఎంక్వయిరీ సందర్భంగా వారి నుంచి వివరాలను సేకరించడానికి ఎలాంటి లీగల్ చిక్కులు లేవని ఈడీ వ్యవహారాలతో సంబంధం ఉన్న న్యాయవాది ఒకరు వివరించారు. సీబీఐ, ఈడీ వేర్వేరు అంశాలకు సంబంధించిన దర్యాప్తు సంస్థలు, వాటికి విడివిడి చట్టాలు ఉన్నప్పటికీ నివృత్తి చేసుకోవాలనుకున్న అంశాలకు సంబంధించి సమాచారాన్ని పరస్పరం పంచుకోడానికి ఇబ్బందులేమీ లేవన్నారు. కన్‌కరెంట్ దర్యాప్తుకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో సీబీఐ ఇటీవల కల్వకుంట్ల కవితను ఒక సాక్షిగా విచారించిన సందర్భంగా వివరాలు వెల్లడించింది. వాటిని సైతం ఈడీ పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉంది.

కొత్తగా ఎవరి పేర్లు?

సీఆర్‌పీసీలోని సెక్షన్ 91 ప్రకారం ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా వచ్చే డాక్యుమెంట్లు, ఎవిడెన్సులను సైతం ఈడీ విశ్లేషించే చాన్స్ ఉంది. అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ తన చార్జిషీట్‌లో పలు విషయాలు పొందు పరిచింది. అందులో ఫోన్ల మార్పు, వాటిల్లోని డిజిటల్ ఎవిడెన్సును ధ్వంసం చేయడం వంటివి కేసు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. కిక్ బ్యాక్ రూపంలో పలువురు వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాలతో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. కొత్త చార్జిషీట్‌లో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయి? వారిని ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తే పరిస్థితి ఏంటి? అని పలువురికి టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే స్టేట్‌మెంట్ల రూపంలో తీసుకున్న వివరాలన్నీ ట్రయల్ సందర్భంగా కోర్టులో విచారణకు రానున్నాయి. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఐదుగురూ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. వారి నుంచి రాబట్టిన వివరాలకు అనుగుణంగా ఇకపైన ఎవరు టార్గెట్ అవుతారనే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ కేసులో సంబంధం ఉందని ఈడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దానిని నివృత్తి చేసుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతున్నది.

Also Read..

నకిలీ లిక్కర్​ వ్యాపారంలో BRS ప్రజాప్రతినిధులు..?

Next Story