- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే నెలలో కీలక పరిణామాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త సైతం చక్కర్లు కొట్టడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. తమ ఫోన్లను ట్యాప్ చేశారని బాధుతులే నేరుగా సిట్ ఎదుట చెప్పడం గమనార్హం. రాజకీయంగా, ఆర్థికంగా లొంగదీసుకోవడానికి దీనిని ఉపయోగించారని, ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టడానికి, వారిని దొంగ దెబ్బతీయడానికి ఆసరాగా చేసుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారు.
ఇప్పటికే నలుగురు అరెస్ట్
వాస్తవానికి ఫోన్‌ట్యాపింగ్‌ను ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే ప్రయోగించాలి. కానీ, బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి పాటించకుండా విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదవడంతో పాటు విచారణ సైతం కొనసాగుతున్నది. సుప్రీంకోర్టు ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. అనంతరం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో పాటు శ్రవణ్ రావును సైతం కొన్ని మినహాయింపులతో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ నుంచి సైతం సిట్ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆయన వాదనను రికార్డు చేశారు.
తాజాగా కేసీఆర్, హరీశ్?
తాజాగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హారీశ్‌రావును సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నదని, అందుకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నదని సమాచారం. వచ్చేనెల మొదటి వారంలో వీరికి నోటీసులు జారీ అవుతాయని తెలిసింది. ఫోన్ట్యాపింగ్ఎందుకు చేయించాల్సి వచ్చింది? రాజకీయ ప్రత్యర్థులను, వ్యాపారవేత్తలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? తదితర విషయాలపై విచారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫోన్ట్యాపింగ్జరిగిన సమయంలో డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డి, అప్పటి సీఎస్శాంతి కుమారి స్టే్ట్‌మెంట్ రికార్డు చేశారు.
సజ్జనార్ ఎంట్రీతో పెరిగిన స్పీడ్
ఫోన్ట్యాపింగ్కేసు సిట్చీఫ్గా హైదరాబాద్సీపీ సజ్జనార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేసు విచారణలో వేగం పెరిగింది. సమీక్షలు, సమావేశాలు సైతం పెరిగాయి. తాజాగా ఈ కేసులో ప్రధాన సూత్రదారులని ఆరోపణలు ఎదుర్కంటున్న కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సమాచారం. వీరిని విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
తన భర్త ఫోన్‌ను కేటీఆర్ ట్యాప్ చేయించారని కవిత ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కూతురు కవిత కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత బావ ఫోన్‌నే ఆయన ట్యాప్చేయించారని పలుమార్లు మీడియా వేదికగానే వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌పార్టీ కీలక నాయకులతో పాటు కొందరు జడ్జీలు, మీడియా ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల ఫోన్లనూ ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
- Tags
- phone tapping






