E-Car Race Case: ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు

by Prasad Jukanti |   (  Updated:2025-09-24 06:30:37  IST  )

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

E-Car Race Case: ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పట్లో హెచ్ఎండీఏ కమిషనర్‍గా కొనసాగిన అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ రెడ్డి, బీఎల్ఎన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. ఈ-ఫార్ములా కార్ రేస్ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని తేల్చిన ఏసీబీ ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ పరిశీలనకు పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అధికారులపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది.

కేటీఆర్ పై గవర్నర్ వద్ద పెండింగ్:

మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్‍పై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ సమర్పించిన నివేదికను సీఎస్ గవర్నర్ కు పంపించారు. దీనిపై ఇప్పటి వరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. కాగా బీఆర్ఎస్ హయాంలో 2023లో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా -ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని తద్వారా ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Next Story