- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ కీలక నిర్ణయం.. క్రషర్ మాఫియాకు చెక్ పెట్టేలా సరికొత్త పాలసీ
క్రషర్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: క్రషర్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అందుకోసం త్వరలో క్రషర్ పాలసీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే పాలసీ విధివిధానాలను తయారు చేసి, న్యాయ శాఖ సలహా కోసం పంపింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పాలసీని ప్రకటించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ పాలసీ అందుబాటులోకి వస్తే అక్రమాలను కట్టడి చేయొచ్చు. మరోవైపు ప్రభుత్వానికి సైతం ఆదాయం పెరుగుతుంది.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 750 క్రషర్ యూనిట్లు పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా కంకర, రోబో సాండ్ తయారు చేస్తుంటారు. యూనిట్లు అనుమతి ఇచ్చినందుకు, అలాగే అక్కడ కంకర, రోబో సాండ్ తయారీకి సంబంధించి ప్రతి టన్ను లెక్కన మైనింగ్ శాఖకు ఫీజు చెల్లించాలి. క్రషింగ్ యూనిట్లలో ప్రతి నెలా వేలాది టన్నుల్లో కంకర, సాండ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ లెక్కలను వందల టన్నుల్లోనే చూపి తక్కువ ఫీజులు చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. పగలు మాత్రమే క్రషింగ్ చేయాలనే నిబంధనలు ఉన్నా వాటిని నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలోనూ పనులు కొనసాగిస్తున్నారు.
లీడర్లకు, ఆఫీసర్లకు వాటాలు!
నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తూ ఓనర్లు లాభం పొందుతున్నారు. అందులో స్థానిక మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు, లోకల్ లీడర్లు సైతం పెద్ద ఎత్తున వాటాలు వెళ్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిని గమనించిన ప్రభుత్వం.. క్రషింగ్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకు క్రషర్స్‌లో ఉత్పత్తి అవుతున్న కంకర, రోబో సాండ్‌కు కచ్చితంగా ఫీజు వసూలు చేసేందుకు పాలసీని సిద్ధం చేసినట్టు టాక్.
కరెంట్ వినియోగం ఆధారంగా..
ప్రస్తుతం ఒక్కో క్రషింగ్ యూనిట్‌లో ప్రతి నెలా ఎన్ని టన్నుల కంకర, రోబో ఇసుక ఉత్పత్తి అవుతుంది? అనే దానిపై సదరు క్రషర్ ఓనర్ చెప్పిన లెక్కల ప్రకారమే అధికారులు ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ పాలసీ అమల్లోకి వస్తే ప్రతి నెలా ఒక్కో క్రషింగ్ యూనిట్‌లో వినియోగించిన కరెంటు ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక యూనిట్‌లో ఒక గంట పాటు క్రషింగ్ చేస్తే, అందుకు ఎంత కరెంట్ వినియోగం అవుతుంది? ఆ గంట సమయంలో ఎంత కంకర, రోబో ఇసుక ఉత్పత్తి చేయవచ్చనే లెక్కలు తీశారు. దీంతో ప్రతి నెలా వినియోగించిన కరెంట్ ఆధారంగా క్రషింగ్ ఓనర్లు ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పాలసీ ప్రకటన
అక్రమాలకు అవకాశం లేని క్రషింగ్ పాలసీ ప్రస్తుతం హర్యానా, హిమచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. త్వరలో కర్ణాటకలో సైతం అమలు చేసేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న క్రషింగ్ పాలసీని స్టడీ చేసి.. ఇక్కడ ఆ తరహా పాలసీని రెడీ చేశారు. ప్రస్తుతం న్యాయ శాఖ ఆ పాలసీకి తుది రూపం ఇచ్చే పనిలో ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని సభలో సీఎం ప్రకటించాలని భావిస్తున్నారు.






