వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం.. సాగు చేసిన విస్తీర్ణానికే యూరియా పంపిణీ

by Kema Shiva Kumar |

యాసంగి సీజన్‌లో యూరియా కొరత లేకుండా బ్లాక్​మార్కెట్‌లో విక్రయాలు జరగకుండా వ్యవసాయ శాఖ కట్టడి చేయనుంది.

వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం.. సాగు చేసిన విస్తీర్ణానికే యూరియా పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్‌లో యూరియా కొరత లేకుండా బ్లాక్​మార్కెట్‌లో విక్రయాలు జరగకుండా వ్యవసాయ శాఖ కట్టడి చేయనుంది. సాగు చేసిన వివరాల ప్రకారం పంపిణీ కానుంది. రైతులు ఈ సీజన్‌లో ఎంత పంట సాగు చేస్తున్నారో పట్టాదారు పాస్ బుక్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పంట సాగు పరిగణనలోకి తీసుకొని జిల్లాలకు ఎంత యూరియా కావాలో లెక్కలు తేల్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గత పంట కాలాలలో అవసరానికి మించి యూరియా వాడకం చేయడంతో చాలా మంది రైతులకు యూరియా దొరకలేదు. చేను ఎదిగే దశ కావడంతో రూ. 150 ఎక్కువ చెల్లించి బ్లాక్​మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రైతు వేదికలు వద్ద పంపిణీ చేసిన బడా రైతులకే దొరికింది తప్ప సన్న, చిన్నకారు, కౌలు రైతులు యూరియా సరిపడా లభించలేదు.

రైతులకు యూరియా దొరకకపోవడంతో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇలాంటి పరిస్ధితి ఈ సీజన్​రాకుండా ముందు జాగ్రత్తగా ఎంత యూరియా కావాలో ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నారు. వరి పంట సాగు చేసిన ప్రకారమే పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. ఈ సీజన్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా నిల్వలు అవసరమని కేంద్రానికి లేఖ రాసింది. ఈనెలాఖరు వరకు నెలకు 2 లక్షల మెట్రిక్​టన్నులు సరఫరా చేయాలని కోరింది. కానీ, ఇప్పటి వరకు రెండు నెలకు సంబంధించిన యూరియా నిల్వలు సగం మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. మిగతా నిల్వలు త్వరగా ఇవ్వాలని కేంద్ర రసాయనాల శాఖను కోరింది. ఆలస్యం జరిగితే అన్నదాతల నుంచి ఆగ్రహం తప్పదని తెలిపింది. గ్రామాల్లో రైతులు విస్తీర్ణం కంటే ఎక్కువ తీసుకోకుండా ప్రత్యేక యాప్​సిద్దం చేస్తోంది. గత నెల నుంచి ఆధార్ లింకుతో ఈ పోస్ యంత్రాలతో యూరియా, ఇతర మందులు అమ్మకాలు జరుపుతున్నారు. రైతుకు ఉన్న భూమికి ఎంత యూరియా అవసరం అంతే తీసుకునేలా చర్యలు చేపట్టింది. అధికారులను తప్పుదోవ పట్టించి బ్లాక్‌లో అమ్మాలని ఎక్కువ తీసుకుంటే దొంగలు దొరికిపోతారు. అడ్డగోలుగా యూరియా కొనుగోలు చేయకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి రైతులకు కష్టాలు లేకుండా చేయనుంది.

ప్రైవేటు ఫర్టిలైజర్​ దుకాణాల అక్రమ సంపాదనకు కళ్లెం..

పంట కాలం సమయంలో రైతులు యూరియా కోసం ఎగబడుతారో పసిగట్టే ఫర్టిలైజర్ వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అక్రమ సంపాదనకు తెగబడేవారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్డగోలు ధరలకు అమ్మకాలు చేసేవారు. వీరికి కొందరు దళారులు సహకరించి రైతుల ముసుగులో యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి బస్తాలు తీసుకొని వ్యాపారులకు అమ్మేవారు. వీరి దందాకు స్ధానిక వ్యవసాయ శాఖ అధికారులు అండగా ఉండి రైతుల యూరియా అడిగితే స్టాక్​లేదని చెప్పి, బ్రోకర్లు వస్తే క్షణాల్లో ఐదారు బస్తాలను ఇచ్చేవారు. ప్రభుత్వం కొత్తగా రైతులు సాగు విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపులు చేస్తుండటంతో అధికారులు అక్రమ సంపాదనకు కత్తెర పడనుంది. వ్యాపారుల వద్దకు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు ఎగబడే పరిస్థితి ఉండదు. దీంతో ఫర్టిలైజర్​దుకాణాలు బస్తాపై ఉన్న ధరకే అమ్మకం చేయక తప్పదు.

రాష్ట్రంలో 3.10 లక్షల మెట్రిక్​ టన్నులు నిల్వలు..

కేంద్రం గత రెండు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా కేటాయించింది. అక్టోబర్‌కు సంబంధించి 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఓడరేవుల నుండి రాష్ట్రానికి చేరుకోగా, నవంబర్​నెలకు సంబంధించిన 25 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో 3,10 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ నుండి ఇప్పటివరకు సరఫరా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 65 టన్నుల డీఏపీ, 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈనిల్వలు ఒక నెల రోజులో పంపిణీ చేయవచ్చని, మిగతా రెండు నెలలో రైతులకు యూరియా పంపిణీ జరగడం కష్టమైతుంది. ఇప్పటికే మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటలు వేసిన రైతులు ఏమేరకు యూరియా వాడకం చేస్తారో పట్టాపాసు బుక్​వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అధికారులు వివరాల ప్రకారం 6 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు.

Next Story