TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

నిర్మల్ జిల్లాలో సాగునీటి సదుపాయాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లాలో సాగునీటి సదుపాయాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకేశ్వరం మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఫోర్‌షోర్ ప్రాంతంలో చేపట్టనున్న పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణానికి రూ.77.07 కోట్ల పరిమాణంతో వెరియేషన్ అంచనాకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐఅండ్‌సీఏడీ (మైనర్ ఇరిగేషన్) శాఖ జీవో 113ను విడుదల చేసింది. గతంలో 2021 ఫిబ్రవరి 6న ఈ పథకానికి రూ.58.95 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం పనుల వ్యయ అంచనాలు పెరగడంతో సవరణ అంచనాను రూ.77.07 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును టర్న్‌కీ పద్ధతిలో నిర్మించి కమిషన్ చేయడంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు కూడా కాంట్రాక్టర్‌కే అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంజినీర్-ఇన్-చీఫ్ ప్రతిపాదనలు పంపగా, వాటిని ప్రభుత్వం పరిశీలించి ఆమోదం తెలిపింది. పనుల అంచనాలు, రేట్లు, సాంకేతిక ప్రమాణాలు సరైన విధంగా అమలవుతున్నాయో లేదో చూసే బాధ్యత ఆదిలాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించారు. అలాగే పనులు పూర్తయ్యే వరకు ఖర్చులపై పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ పథకం అమలుతో లోకేశ్వరం మండల పరిసర ప్రాంతాల్లో సాగునీరు అందుబాటులోకి రానుంది.

Next Story