Telangana Congress సీనియర్ నేతల కీలక నిర్ణయం!

by Disha Web Desk 2 |
Telangana Congress  సీనియర్ నేతల కీలక నిర్ణయం!
X

ప్రియాంకాగాంధీ ఆధ్వర్యంలో జనవరి 26 నుంచి 'హాత్ సే హాత్ జోడో అభియాన్' యాత్ర ప్రారంభమవుతున్నది. అయితే ఈ యాత్రలో తమ అసంతృప్తిని వెళ్లగక్కాలని సీనియర్లు భావిస్తున్నారు. 'సేవ్ కాంగ్రెస్' ప్లకార్డులను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు యాత్రలో పాల్గొంటూనే, రాష్ట్ర నాయకత్వానికి నిరసనగా ఈ ప్లకార్డుల ప్రదర్శించనున్నారు. అయితే అందరూ ఇదే బాట పడతారా? లేక కొందరు మాత్రమే ఈ దారి ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని సీనియర్లు జట్టు కట్టారు. దీంతో ఏఐసీసీ జోక్యం చేసుకుని చల్లబరిచేందుకు ప్రయత్నించింది. దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి పంపి రాయబారం నడిపింది. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపించినా.. ఎవరి దారి వారిదే అనే ధోరణినే కొనసాగుతున్నది. తాజా పరిస్థితిపై సీనియర్ నేత ఒకరు ఇటీవల మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. "పార్టీకి విధేయుడిగా ప్రియాంకాగాంధీ జరిపే 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో పాల్గొంటా. కానీ రాష్ట్ర నాయకత్వంపై నా నిరసనను 'సేవ్ కాంగ్రెస్' నినాదంతో ప్లకార్డుల ద్వారా తెలియజేస్తా" అని వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎంత మంది సీనియర్లు కలిసి వస్తారో తనకు తెలియదుగానీ, తాను మాత్రం తన జిల్లాలో జరిగే యాత్రలో దీన్ని అమలుచేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీలో నాయకత్వం వ్యక్తులకు పరిమితమైనా నిర్ణయాలు మాత్రం సమిష్టిగా జరగాలని, అన్ని స్థాయిల్లోని నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.

అది జరగని కారణంగానే జిల్లాల నాయకులకు కమిటీల్లో ప్రాధాన్యత లభించలేదని, కనీసం చర్చలు కూడా జరపలేదని, పార్టీ బలహీనపడడానికి ఇలాంటివి దారితీస్తాయన్నారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాల ఇన్‌చార్జిలకు కమిటీల కూర్పు సమయంలో సమాచారం ఇచ్చి అనుకూల, ప్రతికూల అంశాలను వివరించి కింది స్థాయి నేతలను కన్విన్స్ చేయాలనే ఆదేశాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. జిల్లా నాయకులుగా తాము పరిస్థితిని గమనంలోకి తీసుకుని నచ్చచెప్పేవారమని, పరిస్థితి చేయి దాటిపోతుందని అనుకున్నప్పుడు వైఎస్సార్ దగ్గరకు తీసుకువెళ్లేవారమని, ఆయన కన్విన్స్ చేసేవారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం పార్టీలో లేదని, అందువల్లనే అసమ్మతి బద్దలవుతున్నదని వివరించారు. పార్టీ లోపలా, బయటా ఉన్న శక్తుల నుంచి కాంగ్రెస్‌ను కాపాడాలన్న ఉద్దేశంతోనే ప్లకార్డులను చేతపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇది మరో సమస్యకు దారితీస్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని నొక్కిచెప్పారు. తన అభిప్రాయంతో ఎంతమంది అసంతృప్త సీనియర్లు కలిసొస్తారో తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీని బతికించుకోడానికే తన ఈ ప్రయత్నాలని, పార్టీ పట్ల వ్యతిరేకతతో కాదని వివరించారు. తన జిల్లాలో జరిగే 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో ఇదే కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు.

శిక్షణా తరగతులకు దామోదర దూరం!

టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియలాజికల్ సెంటర్‌లో ఎల్లుండి నుంచి జరిగే పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీనియర్ నేత దామోదర రాజనర్సింహ గైర్హాజరు కానున్నారు. ధరణి, పోడు భూములు, రెవెన్యూ సమస్యలు సహా పలు అంశాలపై నిపుణుల ప్రసంగాలతో కూడిన కార్యక్రమానికి పీసీసీ రూపకల్పన చేసింది. ధరణి అంశాలపై దామోదర రాజనర్సింహను స్పీకర్‌గా ఎంపిక చేసింది. కానీ ఆ సమావేశానికి ఆయన హాజరుకావడానికి ఆసక్తిగా లేరు. ఆ సమయంలో శ్రీశైలం ఆలయంలో యాగంలో ఉంటానని, నాలుగు రోజుల పాటు అక్కడ బస చేస్తానని హింట్ ఇచ్చారు. రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్న ధరణి గురించి మాట్లాడడానికి స్పీకర్‌‌గా ఆయనను ఎంపిక చేసినా ఆయన గైర్హాజరైతే ఇంకెవరికి బాధ్యతలు అప్పజెప్తారనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.

Also Read...

బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్



Next Story

Most Viewed