విద్యాశాఖ కీలక నిర్ణయం..! క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లు నిషేధం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

విద్యాశాఖ కీలక నిర్ణయం..! క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లు నిషేధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రూరల్ ఏరియాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పాఠాలు చెప్పకుండా ఫోన్ వాడుతున్నట్లు ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేశారు. దీంతో తరుచూ టీచర్ల ఫోన్ల వాడకంపై విమర్శలు వస్తుండడంతో అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యాశాఖ భావించింది. అందుకే ఇటీవల మూడు రోజులు ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జరుగుతున్న డీఈఓలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లకు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈఓలకు పలు సూచనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్లు వాడొద్దనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు సూచించారు. స్కూళ్లను ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

అడ్మిషన్ల పెంపునకు చర్యలు

పిల్లలను బడిబాట పట్టించేలా టీచర్లు తమ పాఠశాలల పరిధిలో జూన్ 1 నుంచి 11 వరకు ఇంటింటికి తిరిగి పిల్లలు, వారి తల్లిదండ్రులను మోటివేట్ చేయాల్సి ఉంటుంది. 5ఏళ్లు నిండిన పిల్లలు బడిబాట పట్టేలా వాళ్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. కానీ ఈ ప్రక్రియ కూడా గ్రౌండ్ లెవల్ లో ఆశించినంతగా జరగకపోవడం కూడా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తగ్గడానికి కారణమవుతోందని పలువురు రిటైర్డ్ టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు..

అడ్మిషన్ల పెంపు, నాణ్యమైన విద్యాబోధనకు తరగతి గదుల్లో టీచర్లు ఫోన్లు వాడొద్దనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈఓలకు సూచించింది. అయితే ఈ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ అవసరం ఉంటుందని వాదిస్తుండగా, మరికొందరు విద్యాశాఖ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మొత్తానికి విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫోన్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Next Story