Kavitha: లాఠీ దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధమే

by Gantepaka Srikanth |

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ.. రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డిని ఉల్లంఘించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Kavitha: లాఠీ దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ.. రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డిని ఉల్లంఘించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్‌కు ఆమె లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్‌కు విరుద్ధంగా రిక్రూట్‌మెంట్లు జరిపినట్లు ఎంతో మంది అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీజీపీఎస్సీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తమ ఉద్యోగాలు తమకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని.. ఈ క్రమంలోనే ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డిని సాధించుకున్నారని గుర్తు చేశారు. 371-డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ.. తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 నియామకాల్లో ఆర్టికల్ 371-డిని ఉల్లంఘించటమే కాకుండా టీజీపీఎస్సీ చాలా తప్పులకు పాల్పడిందని పేర్కొన్నారు.

ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ తన చర్యతో అటు రాజ్యాంగంపై, ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందని తెలిపారు. పైగా ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినా టీజీపీఎస్సీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణ జరపాలని కోరారు. అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్‌ను కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

వీవోఏల ధర్నాకు మద్దతు

ఇందిరాపార్క్ వద్ద వీవోఏలు చేపట్టిన ధర్నాకు కవిత మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీవోఏల హక్కుల సాధనకు లాఠీ దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని తేల్చిచెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వీవోఏలకు రూ.26 వేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారని.. అసలు అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేక ఇష్టానుసారం హామీలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి ఇచ్చిన హామీలు గుర్తు లేవన్నారు. ఆయనకు ఒక్క సోనియమ్మ తప్ప తెలంగాణ సోయి లేదని.. జై తెలంగాణ అనకుండా జై సోనియమ్మ అంటున్నారని ఆరోపించారు. రూ.8 వేలు ఉన్న వీవోఏల జీతం రూ.26 వేలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Next Story