High Court: నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా..? కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై హైకోర్టు ప్రశ్న

by Prasad Jukanti |

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా..? అని తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

High Court:  నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా..? కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై హైకోర్టు ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా..? అని తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషననర్ల తరఫున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే ఈ నివేదిక ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యలపై ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.

రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య ఏది..?

విచారణ సందర్భంగా సమర్పించిన పీసీ ఘోష్ రిపోర్టు కాపీ సక్రమంగా లేదని, రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పిటిషనర్ తరఫున లాయర్ ఆర్యమ సుందరం న్యాయస్థానికి క్షమాపణ చెప్పారు. వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన లాయర్లు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, కేసీఆర్ అడిగినా కమిషన్ రిపోర్టు ఇవ్వలేదని వాదించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, రిపోర్టు వివరాలను సీఎం మీడియా సమావేశంలో వెల్లడించారని తెలిపారు. 60 పేజీల కమిషన్ రిపోర్ట్‌ను మీడియా ప్రతినిధులకు అందజేశారని కోర్టుకు తెలిపారు.

Next Story