సామాన్యుడికి బ్యాడ్ న్యూస్.. ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

పశ్చిమాసియా యుద్ధం కొనసాగితే దేశంలో ఇంధన ధరలు పెరగక తప్పదని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు.

సామాన్యుడికి బ్యాడ్ న్యూస్.. ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా చమురు ధరలు పెరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మరింత కాలం పాటు కొనసాగితే భారత్‍లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి రావచ్చని తెలిపారు. తాజాగా స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకెంత కాలం సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పరిస్థితులను బట్టి చమురు ధరలు పెరిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వస్తువుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నారు. దేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని మరియు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛంద పొదుపును కోరిన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్‍పై ఆందోళన:

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే యుద్ధం కారణంగా వృద్ధి నెమ్మదించి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆర్బీఐ తన కీలక పాలసీ రెపో రేటును ఏప్రిల్‌లో 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. భారతదేశ ద్రవ్యోల్బణం మార్చిలోని 3.40 శాతం నుండి ఏప్రిల్‌లో 3.48శాతానికి స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వం పెరిగిన ముడి చమురు ధరలను భరించడంతో ఇది అంచనాల కంటే తక్కువగా నమోదైంది. అయినప్పటికీ, మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు భవిష్యత్ అంచనాలపై ప్రభావం చూపుతుండటంతో భవిష్యత్‍పై ఆందోలన నెలకొంది.

వడ్డీ రేట్లు పెంచాలి:

రూపాయిని కాపాడాలంటే ఆర్‌బిఐ వడ్డీ రేట్లు పెంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. నాటిక్సిస్ సీనియర్ ఆర్థికవేత్త ట్రిన్ గుయెన్ మాట్లాడుతూ.. ఇంధన ధరలను కృత్రిమంగా తక్కువగా ఉంచడం వల్ల డిమాండ్ అధికంగానే ఉంటుందన్నారు. కాబట్టి భారతదేశం పెరిగిన ఇంధన వ్యయాలను వినియోగదారులపైకి చేరనివ్వాలన్నారు. ఇది రూపాయిపై ఒత్తిడిని తగ్గించడానికి ఎలా సహాయపడుతుందో ఆమె వివరించారు. భారత కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి మూలధన ప్రవాహాలను ఆకర్షించడానికి, ద్రవ్యోల్బణ ప్రమాదాలను అరికట్టడానికి ఆర్‌బీఐ ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచాలని ఆమె సూచించారు.

Next Story