- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూటకపు ఎన్‍కౌంటర్లను ఖండిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్
ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హిడ్మాతో సహా ఇటీవల జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులు, భద్రతా దళాలు ఇరువైపుల హింసను ఖండిస్తోందని చెప్పారు. మావోయిస్టులు తుపాకీ పంథా ఎంచుకున్నప్పటికీ వారు కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే తమ జీవితాలను త్యాగం చేశారని దీంట్లో ఎలాంటి అనుమానం లేదన్నారు. వారు ఎంచుకున్న మార్గం రాజ్యాంగ ప్రకారం నచ్చకపోవచ్చు కాని వారంతా పేదల కోసమే పని చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎన్‍కౌంటర్లు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ విధానం ఎంచుకుందని విమర్శించారు.
అలా మాట్లాడితే దేశ ద్రోహి ముద్రవేశారు:
తాను కూడా స్వయంగా మావోయిస్టుల బాధితుడినేనని తన ఆస్తులను సైతం పోగొట్టుకుని చాలా ఇబ్బందులు పడ్డానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే అవి ఆనాటి పరిస్థితులు అని హింసను కాంగ్రెస్ పార్టీ సమర్ధించదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తుడిచివేయాలనే పద్ధతిలో వెళ్తోందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే పాకిస్తాన్‍తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపిన కేంద్రం.. మావోయిస్టుల విషయంలో ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటింటించడం లేదని నిలదీశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇచ్చిన వెసులు బాటు మన సొంత పౌరుల విషయంలో ఎందుకివ్వరని ప్రశ్నిస్తే తనను దేశ ద్రోహిగా బీజేపీ ముద్రవేసిందన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తామని మావోయిస్టులు చెబుతున్నా వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకుని వారి ద్వారా సమాచారం సేకరించి పట్టుకుని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లపై అనుమానాలు ఉన్నాయన్నారు. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఉద్దేశంతోనే ఆపరేషన్ కగార్‍కు పూనుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో తమకు వ్యతిరేక శక్తులు ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్ఐఆర్ ను ఉపయోగించి అధికారం హస్తగతం చేసుకుంటోందని ఆరోపించారు. ఎందుకు ప్రజలు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదన్నారు.






