నవంబర్ 14 తర్వాత కాంగ్రెస్, బీజేపీలో భారీ మార్పులు?

by Prasad Jukanti |

బిహార్, జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత జాతీయ పార్టీల్లో సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

నవంబర్ 14 తర్వాత కాంగ్రెస్, బీజేపీలో భారీ మార్పులు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయం అంతా బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) చుట్టూ తిరుగుతోంది. భవిష్యత్ జాతీయ రాజకీయాలకు రూట్ మ్యాప్ వేయబోతున్నాయని చెప్పబడుతున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది దేశ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయిన బిహార్ లో రేపు రెండో దశ పోలింగ్ కు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల తర్వాత జాతీయ పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్‍లో(Congress) కీలక మార్పులు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్ ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ కేంద్ర నాయకత్వం సంస్థాగతంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడనుండగా ఆ మరుసటి రోజు నుంచి నవంబర్ 30 మధ్యలో సంస్ధాగత నిర్మాణంలో గణనీయమైన మార్పులు ఉండవచ్చని, అలాగే చాలా కాలంగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై తుది నిర్ణయం వెలువడే చాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్ ఫలితాలు సానుకూలంగా వస్తే సరే వ్యతిరేకంగా వస్తే బిహార్ బీజేపీ యూనిట్ నుంచి పార్టీ కేంద్ర స్థాయి వరకు కఠినమైన దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏఐసీసీలోనూ మార్పులు:

బిహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్ర నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC)లో భారీ మార్పులు ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గడిచిన కొన్ని వారాలుగా రహస్యంగా వరుసగా సమావేశం అవుతున్నారని, ఈ భేటీ ఏఐసీసీ పునరేకీకరణ కోసమేననే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బిహార్ ఫలితాలతో పాటు రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటక, తెలంగాణలోని పార్టీ పరిస్థితుల ఆధారంగా కీలక మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ స్థానంలో మార్పు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బిహార్ ఫలితాలు దేశ రాజకీయాల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by Poll) ఫలితం తెలంగాణ రాజకీయంలో కీలక మలుపులకు టర్నింగ్ పాయింట్‍గా మారబోతోందనే చర్చ వేళ బిహారీ ఓటర్లు జాతీయ పార్టీల తలరాతలను ఎలా మార్చబోతున్నారు అనేది తేలాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Next Story