- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోంది’.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నిక(Election of local bodies)ల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నిక(Election of local bodies)ల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ప్రకటించారు. ‘‘నాకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న నా కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు.. గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు నేను సిద్ధం. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం’’ అని స్పష్టం చేశారు. ఆసియా కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే రేపు జరగబోయే కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్ (ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. టిక్కెట్లు ఇవ్వడంతోపాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు. ఈరోజు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకపోవడమే కాక అభివృద్ధి పేరుతో నాటి సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా వేధించింది. కేంద్రం నుండి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవంటూ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా ఈ పార్టీ చేతులెత్తేసింది. దేశ చరిత్రలో 22 నెలలుగా పంచాయతీలకు నయాపైసా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. పంచాయతీ సిబ్బంది జీతాలివ్వడం లేదు. ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కూడా ఇయ్యడం లేదు. పంచాయతీల్లో అంతో ఇంతో అభివృద్ధి చెందుతోందంటే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే కారణం. ఏటా క్రమం తప్పకుండా పంచాయతీలకు ఠంచన్‌గా నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే. జాతీయ ఉపాధి హామీ పథకం మొదలు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(సీఆర్ఐఎఫ్), ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాకా ఈరోజు గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేస్తున్నవే. స్థానిక సంస్థల పాలక మండళ్ల గడువు ముగిసి రెండేళ్లు కావొస్తున్నా కాంగ్రెస్ పాలకులు ఎన్నికలను నిర్వహించకపోవడంవల్ల రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. దీనికి ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే కారణం. కేంద్రం నుండి నిధులు ఆగిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించి ఆ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామాలను, మండలాలను అభివృద్ధి చేసుకుందామనే ఆసక్తి కాంగ్రెస్ పాలకులకు లేనే లేదు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లి ఎండగడతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పల్లెపల్లెకూ వివరిస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన పాపాలను సైతం వివరించి ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మి గెలిపిస్తే ఈసారి ఊరు వల్లకాడు అవుతుందనే వాస్తవాన్ని ప్రజల ముందుంచుతాం. అదే సమయంలో గ్రామ పంచాయతీలకు మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు ఆ నిధులవల్ల జరిగిన అభివృద్ధిని సైతం ఇంటింటికీ వివరిస్తాం. ఢిల్లీలోనే కాదు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం. అత్యధిక మండల పరిషత్ పీఠాలతోపాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలను సైతం కైవసం చేసి ఈ కొత్త చరిత్రను లిఖించబోతున్నాం. బీజేపీ పక్షాన నిలబడే అభ్యర్థులను ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నా..
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు నేను చెప్పేదొక్కటే. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తాం. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయి. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో నిన్నటి నుండి సర్వే టీంలు రంగంలోకి దిగాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం. గెలుపే గీటురాయిగా భావించి టిక్కెట్లు ఇస్తాం. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కొన్ని చోట్ల గెలిచే అవకాశం లేకపోయినా, రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దు. వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తాం. అంతిమంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాలు సాధించి కాషాయ జెండా సత్తాను చాటాలని కోరుతున్నా’’ అని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.






