ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ షాకింగ్ డిసిషన్.. బీఆర్ఎస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ అలా!

by Disha Web Desk 13 |
ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ షాకింగ్ డిసిషన్.. బీఆర్ఎస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ అలా!
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాబోయే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్‌ సెగ్మెంట్ ల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు తమ పార్టీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుంటే ఇవన్ని తాత్కాలిక ఎదురుదెబ్బలేనని రాబోయే రోజుల్లో మంచికాలం ఉందంటూ కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులను ప్రకటిస్తున్న గులాబీ బాస్ నిన్న తాజాగా మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నిజామాబాద్ అభ్యర్థిగా తన కుమార్తె కవితకు బదులు మరో నేత పేరు అనౌన్స్ చేయడం బీఆర్ఎస్ లో కొత్త చర్చకు దారి తీసింది.

పార్టీ చరిత్రలో తొలిసారి!:

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 2001 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ, అటు ఎంపీ ఎన్నికల బరిలో కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. 2004 లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయగా, 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి గెలుపొందారు. 2014లో మెదక్ స్థానం నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి తన కూతురు కవిత పోటీ చేసి విజయం సాధించగా కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకే పరిమితం అయ్యారు. కవిత మాత్రం నిజామాబాద్ ఎంపీగా కొనసాగారు. 2019లో మరోసారి అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఒకరి పేరు కూడా లేదు. పైపెచ్చు కవిత స్థానం నిజామాబాద్ లో మరొకరి పేరు అనౌన్స్ చేయడం చర్చగా మారింది. దీంతో ఈసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎంపీ ఎన్నికల్లో ఎవరైనా పోటీలో ఉంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే పార్టీ చరిత్రలోనే తొలిసారి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంపీ ఎలక్షన్లకు దూరంగా ఉన్నట్లు అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పెండింగ్ స్థానాల్లో పోటీ చేస్తారా?:

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్తితుల నేపథ్యంలో బీఆర్ఎస్ మరోసారి పుంజుకోవాలంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంపీ ఎన్నికల బరిలో ఉండాలనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్, కవిత, కేటీఆర్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ లో కవిత, మల్కాజిగిరిలో కేటీఆర్ పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపించింది. కానీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నా కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం చర్చగా మారింది. గతంలో కవిత పోటీ చేసిన నిజామాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. ఇక కేసీఆర్ ఇది వరకు పోటీ చేసిన రెండు స్థానాల్లో మహబూబ్ నగర్ కు అభ్యర్థిని ప్రకటించగా మెదక్ ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. మల్కాజిగిరికి సైతం అభ్యర్థి ప్రకటించలేదు. అయితే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ పోటీలో ఉంటే ఆ వాతావరణం మరోలా ఉంటుందని అందువల్ల వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీలో ఉండాలనే చర్చ సొంత పార్టీలో జరుగుతుంటే కేసీఆర్ ఆలోచన మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉండాలనే ఈ సరికొత్త ప్రయోగాన్ని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పెండింగ్ ఉన్న స్థానాల్లో అయినా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బరిలోకి దిగుతారా? లేక చరిత్రలో తొలిసారి పోటీకి దూరంగా ఉంటారా అనేది కాలమే సమాధానం చెప్పనున్నది.


Next Story

Most Viewed