రైతు భరోసా ఆలస్యానికి కేసీఆర్ అప్పులే కారణం: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

by Ramesh Naini |

వరంగల్ రైతు డిక్లరేషన్‌ను మా ప్రభుత్వం అమలు చేస్తోందని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్ మాటలున్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

రైతు భరోసా ఆలస్యానికి కేసీఆర్ అప్పులే కారణం: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ రైతు డిక్లరేషన్‌ను మా ప్రభుత్వం అమలు చేస్తోందని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్ మాటలున్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగా అని అరిచినట్లుగా కేటీఆర్ తీరు ఉందని ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు రెండు లక్షల రైతు రుణమాఫీ చేశామని, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో గతం కంటే రెట్టింపు స్థాయిలో రుణమాఫీ చేశామన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీ పైన అసెంబ్లీ నేను సవాల్ విసిరితే స్పందించలేదని, ఇచ్చిన హామీలను అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ కుటుంబం 8 లక్షల కోట్ల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టి పోయారని, ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిందని, బీఆర్ఎస్ అని పార్టీ పేరు మార్చుకుంటే తెలంగాణ ప్రజలు చిత్తు చేశారని విమర్శించారు. ఇప్పటికే నాలుగు సార్లు రైతు భరోసా ఇచ్చామని, కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే రైతు భరోసా కొంత ఆలస్యం అవుతోందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ చెప్పారని, కానీ తమ ప్రభుత్వం సన్న వడ్లు వేసిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తోందని, సీఎంని అవమానించేలా మాట్లాడితే తమ కాంగ్రెస్ కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Next Story