- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR ఇక రాడు.. వచ్చినా ప్రజలను పట్టించుకోడు: ఎమ్మెల్యే యెన్నం కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ భవిష్యత్తులో అసెంబ్లీకి రాడని.. వచ్చినా ప్రజలను పట్టించుకోడని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ భవిష్యత్తులో అసెంబ్లీకి రాడని.. వచ్చినా ప్రజలను పట్టించుకోడని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సీఎస్పీ (CLP) మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం తెలంగాణ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని, తన వాదన వినిపిస్తారని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని, కానీ ఆయన కేవలం ముచ్చటగా 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేటీఆర్ సైతం నగరంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో ఉండకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేసీఆర్ తన మొండితనంతో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని తాము మొదటి నుంచి కోరుతున్నా.. కేసీఆర్ కావాలనే సోర్స్‌ను మార్చి ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టారని విమర్శించారు. కేంద్రానికి, సుప్రీంకోర్టుకు కేవలం తాగునీటి ప్రాజెక్టు అని అబద్ధాలు చెప్పి డీపీఆర్ పంపారని, అందుకే ఇప్పుడు అనుమతులు రావడం లేదని స్పష్టం చేశారు. పైపులు, లిఫ్టులలో వాటాల కోసమే ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదని, తడి గుడ్డతో పాలమూరు ప్రజల గొంతు కోశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ సన్యాసం తీసుకునే టైమ్ వచ్చింది..
నీళ్లపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకునే టైమ్ వచ్చిందన్నారు. 38 సీట్లు ఇచ్చి ప్రజలు పొరపాటు చేశామని తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల తర్వాత బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు బానిసల కన్నా అధ్వాన్నంగా తయారయ్యారని మండిపడ్డారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని, దీనిపై సుప్రీంకోర్టు ఒక పిటిషన్‌ను కొట్టివేసినంత మాత్రాన బాధ్యులు తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడంపై స్పందిస్తూ.. ఆమె నిజంగా ప్రజల కోసం పని చేస్తే తెలంగాణలో స్థానం ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేశారు.






