కేసీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 12:21:03  IST  )

నువ్వెంత.. నీ స్థాయి ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేసీఆర్‌ (KCR)పై మరోసారి విరుచుకుపడ్డారు.

కేసీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నువ్వెంత.. నీ స్థాయి ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేసీఆర్‌ (KCR)పై మరోసారి విరుచుకుపడ్డారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గీ పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలపై పోరాడి ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు.

నేను ఎవరి మీద కేసులు పెట్టి వేధించలే..

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో పాలమూరు (Palamuru)ను పూర్తిగా ఎండబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యాడని.. ఆ తర్వాత సీఎం అయ్యారని, కానీ పాలమూరు నీళ్లు మాత్రం రాలేదన్నారు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లు కూడా పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయని కామెంట్ చేశారు. రెండేళ్ల తర్వాత మీడియాకు ముందుకు వచ్చిన కేసీఆర్ నాలుగు మంచి మాటలు చెబుతారని అనుకున్నామని, మనిషి ఏం మారలేదని సెటైర్లు వేశారు. ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారని, కానీ తాను ఎవరి మీద కేసులు పెట్టి వేధించలేదని అన్నారు. ఎవరి పాపాన్ని వాళ్లే అనుభవిస్తారని సైలెంట్‌గా ఉన్నానని తెలిపారు. కానీ, కేసీఆర్ మా తోలు తీస్తానని అంటున్నారని.. మా తోలు తీయడం కాదు.. మా సర్పంచ్‌లే మీ తోలు వలుస్తారని, చింతమడకలో చీరి చింతకు వేలాడదీస్తారని ఫైర్ అయ్యారు.

నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా కేసీఆర్..

కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా.. ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఇలాగేనా అంటూ ప్రశ్నించారు. తాను కూడా కింది స్థాయి నుంచి వచ్చానని.. మాట్లాడటం తనకు వచ్చని అన్నారు. కొడుకు కేటీఆర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని గొడవ పెడుతుంటే.. తండ్రి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. తానేమి అమాయకులను దుబాయ్ పంపుతానని మోసం చేయలేదని.. కేసీఆర్.. నీ స్థాయి ఎంత..? నువ్వెంత.. నీకు భయపడతామా అని గరం అయ్యారు. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకుని బయటకు నెట్టిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. ఆమెకే సమాధానం చెప్పలేనోడు నాకు సవాలు విసుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో బాత్‌రూంలో కడిగినట్లు అనుకున్నావా.. నాతో మాట్లాడుడంటే అని రేవంత్ ఓ రేంజ్‌లో వాగ్భానాలు సంధించారు.

జూబ్లీహిల్స్‌లో ఓడించాం.. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశాం

2028లోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే 80 శాతానికిపైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. రెండింతల మెజారిటీ ఖాయమని కామెంట్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని.. ఇదే తన శపథం అని అన్నారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటి వరకు బయటకు రాలేదని.. ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని వార్నింగ్ ఇచ్చారు. పదేళ్ల రాష్ట్రానికి ఏం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడదామని అన్నారు. పార్టీ ఆఫీసులో మాట్లాడడు కాదు.. అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ-కార్ రేసింగ్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. డీలిమిటేషన్‌లో సీట్లు పెరిగితే 100కు పైగా గెలవడం పక్కా అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడించామని.. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశామని ధ్వజమెత్తారు. పదేళ్లు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ప్రజలకు తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story