ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-19 02:29:14  IST  )

సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత ప్రజల్లోకి రాలేదు. అటు తెలంగాణ భవన్‌లో సైతం ఆయన ఎప్పుడూ అడుగుపెట్టలేదు.

ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత ప్రజల్లోకి రాలేదు. అటు తెలంగాణ భవన్‌లో సైతం ఆయన ఎప్పుడూ అడుగుపెట్టలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్‌లో ఓటమితో అప్పటి నుంచి ఆయన ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు తరలిరానున్నారు. చాలా నెలల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.

రైతులు, ప్రజా సమస్యలపై పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి 14 నెలలు గడిచింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామంటూ కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. దాంతో ఆయన చెప్పిన టైం లిమిట్ కూడా అయిపోవడంతో ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ తరఫున పోరాడాలని డిసైడయ్యారు. అందులో భాగంగానే ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నది. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే అనే విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలో కార్యకర్తలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలిసింది.

జనగామలో భారీ బహిరంగ సభ?

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్‌తో 25 ఏండ్లు కానుంది. దీంతో పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతున్నది. ఇప్పటికే 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని చెబుతున్న పార్టీ లీడర్లు.. ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా జనగామలో ఈ సభ ఏర్పాటు చేసేందుకు సూచనాప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ సభపై నేడు నిర్వహించబోయే కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజాసమస్యలతో పాటు కులగణనపై ప్రభుత్వాన్ని నిలదీసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారని తెలిసింది.

Next Story