డైరీల్లో రాసుకోండి.. వందకు వందశాతం జరిగేది అదే.. కేసీఆర్ మార్క్ వార్నింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-27 14:20:35  IST  )

ఎల్కతుర్తి వేదికగా జరుగుతోన్న బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్(KCR) రెచ్చిపోయారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఫైర్ అయ్యారు.

డైరీల్లో రాసుకోండి.. వందకు వందశాతం జరిగేది అదే.. కేసీఆర్ మార్క్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్కతుర్తి వేదికగా జరుగుతోన్న బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్(KCR) రెచ్చిపోయారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఫైర్ అయ్యారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి దొంగనాటకాలు ఆడారని సీరియస్ అయ్యారు. దళితబంధుతో రూ.12 లక్షలు, కల్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, రూ.4 వేల పెన్షన్, ఆడబిడ్డలకు స్కూటీలు వంటి అనేక పనికిమాలిన హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచారని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్(Congress) మించినోళ్లు ప్రపంచంలోనే ఎవరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో ఎక్కడికి వెళితే.. అక్కడ ఆ దేవుడి మీద ఒట్టు వేసి.. దేవుళ్లను కూడా మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది.. ఈ ఏడాదిన్నరలో ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో బంగారం లాగా ఉన్న తెలంగాణలో మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులు వచ్చాయని అన్నారు.

నా కళ్ల ముందే మళ్లీ తెలంగాణ ఇలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. తులం బంగారం రాలేదు. ఇంటింటికీ మంచినీళ్లు రాలేదు. ఆర్టీసీల్లో మహిళల మధ్య గొడవలు సృష్టించి తెలంగాణను మళ్లీ కకావికలం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో భూముల ధరలు అద్భుతంగా ఉండేవని.. ఏడాదిలోనే అంతా తలకిందులు చేశారని మండిపడ్డారు. పదేళ బీఆర్ఎస్ పాలనలో.. ఎక్కడో ఉన్న తెలంగాణను చాలా ముందకు తీసుకెళ్లిపోయాం.. పదేళ్లలో అద్భుతమైన పనులు చేసి చూపించాం.. ఎన్నో రంగాల్లో తెలంగాణను నంబర్‌వన్‌ చేశాం.. చెరువుల నిండా నీళ్లు.. రికార్డుస్థాయిలో పంటలు పండించాం.. తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం.. అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నామని అన్నారు. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేశాం.. మిషన్‌ భగీరథ, కేసీఆర్‌ కిట్స్‌, కంటివెలుగు, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎవరూ అడగకపోయినా అమలు చేశాం.. ఐటీ రంగంలోకి కొత్తగా 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

తాము విచక్షణతో పనిచేశాం.. రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగించామని అన్నారు. ఇలా పనిచేయడం చేతగాక హైడ్రా అనే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములు అమ్ముకుంటున్నారు. అసలు ఏ భూములు అమ్ముకోవాలి. ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు. వందకు వందశాతం మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story