- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో త్వరలోనే మరో కొత్త టీవీ ఛానెల్.. ఎన్నికల వేళ KCR సెన్సేషనల్ డెసిషన్..?
క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. నియోజకవర్గం వారిగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని, పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని అన్నారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, పశు సంపద, మత్స్య సంపద, ఇలా ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లు వేసుకొని వచ్చి చూసి పోతున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదని, మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలని అనేది ప్రాధాన్యతాంశం అన్నారు. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై ఛాన్స్.. బట్ బై చాయిస్ అని పేర్కొన్నారు. దూప అయినప్పుడు బావి తవ్వకం అనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని.. తప్పక విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి చేపట్టవచ్చు అని, అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడపవచ్చని భారీ ప్లాన్‌ను నేతలకు సూచించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదని, తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నదని.. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీయడం లేదని ప్రశ్నించారు. 2021-2022 ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు ఉంటే.. అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నామని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నామన్నారు.
టీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినామని అన్నారు. అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామన్నారు.
కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లేసి నా ఆఫీసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దాం అన్నారు. శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జీలుగా ఉపయోగించుకోవాలని, ఈ 3, 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయని, ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518.. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ అన్నారు. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 ఉన్నాయని, తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు అని అన్నారు.
పలు తీర్మానాలు ఆమోదం..
బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో పలు తీర్మానాలను ఆమోదించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తీర్మానాలపై అంశాల వారీగా చర్చించారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ ప్రధాన తీర్మానం చేశారు.
తీర్మానాలు..
1.దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా టీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం.
2.దేశంలో రైతురాజ్యం స్థాపించాలని- ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మానం.
3. 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానం.
4.మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఫుడ్ ప్రాజెక్టు లను ఎగుమతి చేయాలని తీర్మానం.
5.దళితబందు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం
6.దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని తీర్మానం.
7.దేశంలో బిసి జనగణన జరపాలని తీర్మానం.
8.దేశంలో ద్వేషాన్ని విడిచి.. ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని చేసిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.






