KCR: గులాబీ బాస్ టూ అర్లీ.. ఎమ్మెల్యేలు లేట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-13 04:09:08  IST  )

‘అసెంబ్లీకి కేసీఆర్ ఉదయం 10 గంటలకు వస్తారు. అంతకంటే ముందుగా సభ్యులు చేరుకోవాలి.

KCR: గులాబీ బాస్ టూ అర్లీ.. ఎమ్మెల్యేలు లేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అసెంబ్లీకి కేసీఆర్ ఉదయం 10 గంటలకు వస్తారు. అంతకంటే ముందుగా సభ్యులు చేరుకోవాలి. అందరూ సార్ కు వెల్ కం చెప్పాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందురోజు సమాచారం ఇచ్చారు. కానీ, బుధవారం కేసీఆర్ అసెంబ్లీ‌లోకి వచ్చే సమయానికి మెజారిటీ సభ్యులు హాజరు కాలేదు. రాని సభ్యులకు ఫోన్ చేసి త్వరగా రావాలని సూచించారు. ఆలస్యంగా వచ్చిన సభ్యులను ఉద్దేశించి కేటీఆర్ తనదైన శైలీలో ‘చెప్పిన టైమ్ కు రావొచ్చు కదా అన్న’ అంటూ సెటైర్లు వేశారు.

కేసీఆర్ వెంట జగదీశ్, ప్రశాంత్

మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిని వెంటపెట్టుకుని ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అప్పటికే ఆయన కోసం వెయిట్ చేస్తున్న మాజీ మంత్రులు హరీశ్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు ఇతర సభ్యులు ఆయనకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో కేసీఆర్ కు కేటాయించిన చాంబర్ లో ఆయన ఇతర సభ్యులతోపాటు కలిసి కూర్చున్నారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం చాంబర్ బయట నిబపడి, ఆలస్యంగా వచ్చిన సభ్యులను ముందుగా విష్ చేసి తరువాత సెటైర్లు విసిరారు. ‘ముందుగనే చెప్పినం కదా అన్న. సార్ కంటే ముందుగా అసెంబ్లీకి రావాలి అని.. కాని మీరు టైమ్ ఫాలో కాలేదు.. మీరు లేట్ గా వచ్చిండ్రు. సార్ లోపల వేయిట్ చేస్తుండు.. వెళ్లి కలవండి.’ ’అని లేట్ గా వచ్చిన ఒక్కొక్క మెంబర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు.

మెట్రోలో సుధీర్ రెడ్డి, కాలినడకన సబిత

కేసీఆర్ వచ్చేలోపు అసెంబ్లీలోకి రావాలని ఎల్పీ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. దీంతో సభ్యులు అసెంబ్లీకి త్వరగా వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మెట్రోలో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అవడంతో రవీంద్రభారతి ముందు కారు దిగిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాలినడకన అసెంబ్లీలోనికి వచ్చారు.

ఏఐలో నా డెత్ డేట్ చూసుకున్న : చామకూర

ఆలస్యంగా వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ‘చామకూర ఎక్కడ అని సారు అడిగిండు.. లోనికి వెళ్లి సారును కలువు’ అని అన్నారు. వెంటనే మల్లారెడ్డి లోనికి అలా వెళ్లి కేసీఆర్ ను కలిసి బయటికి వచ్చారు. ఆయనతో పిచ్చాపాటిగా ఇతర విషయాలు మాట్లాడిన కేటీఆర్ ‘హెల్త్ ఎలా ఉంది మల్లన్న’ అని ఆరా తీశారు. ‘నాకు ఏం కాదు. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ లో నా డెత్ డేట్ చూసుకున్న.’ అని అన్నారు. ఆ డేట్ ఎప్పుడు అని కేటీఆర్ అడిగితే.. అది ఎట్ల బయటికి చెప్తా? అని సమాధానం ఇచ్చారు.

Next Story