రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై.. అసలు కారణం అదేనా?

by Gantepaka Srikanth |

గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది.

రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై.. అసలు కారణం అదేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు వయోభారం, మరోవైపు కొత్తతరం లీడర్లను ధైర్యంగా ఎదుర్కొనే ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా? అనే చర్చ జరుగుతున్నది. అధికారం దూరం అయినప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు. పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. ఇక కవిత ఎపిసోడ్ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని.. ‘సొంత పార్టీనే చక్కదిద్దలేని లీడర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తడు?’ అనే విమర్శలు వస్తున్నాయి.

త్వరలోనే వస్తా.. వరంగల్ వేదికగా ప్రకటన

ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభలో ప్రజల ముందుకు వచ్చిన మాజీ సీఎం.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. ‘కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగాను. ఇప్పటి నుంచి బయటకు వస్తా.. అందరి తరపున పోరాడుతా’ అని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి దాదాపు 4 నెలలు పూర్తయినా ఇంతవరకు కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు రాలేదు. ఈ నాలుగు నెలల్లో ప్రజా సమస్యలను అడ్రస్ చేసేందుకు ఆయన ఎక్కడా కనిపించలేదు. ఇటీవల యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీనిపై కనీసం ఆయన స్పందించలేదనే విమర్శలున్నాయి.

అన్నింటికీ మౌనమే..

పార్టీ ఆవిర్భావం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసేవారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకటనలు, విమర్శల చుట్టూనే అన్ని పార్టీలు చక్కర్లు కొట్టేవి. అంతగా రాజకీయాలను శాసించిన గులాబీ బాస్.. పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్‌ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఆయన పాలన తీరు, తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ ఆంశాలపై సీఎం రేవంత్, మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా రు. అలాగే బీజేపీ లీడర్లు సైతం ఆయనపై ఎటాక్ చేస్తున్నారు. వీటిపై నేటి వరకు గులాబీ బాస్ స్పందించలేదు. మౌనం ఎప్పుడు వీడతారా? అని అటు పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. చివరకు జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ నిర్ణయాల వల్లే తప్పిదాలు జరిగాయని రిపోర్టు ఇచ్చినా ఇంత వరకు మాజీ సీఎం స్పందించకపోవడం గమనార్హం.

సమయం ఇవ్వరు.. కలవరు

గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లో ఉంటున్న కేసీఆర్.. పార్టీ లీడర్లను కలిసేందుకు సమయం ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. ఎవరైన చొరవ తీసుకుని అక్కడికి వెళ్లినా కలవడం కష్టం అనే కామెంట్స్ ఉన్నాయి. ఆయన రెగ్యులర్‌గా కేటీఆర్, హరీశ్‌రావు‌తో మాత్రమే టచ్‌లో ఉంటారని టాక్. అడపాదడపాగా పార్టీలోని సీనియర్ లీడర్లను పిలిచి మాట్లాడుతుంటారని ఆ పార్టీ నేతల అభిప్రాయం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఇతర లీడర్లు, ఎమ్మెల్యేలను కలవడకుండా దూరంగా ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో పార్టీ, లీడర్లు ఎదుర్కొనే సమస్యలు వినేందుకు ఆసక్తి చూపించనప్పుడు ఆ హోదా ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు.. ఇప్పుడు సైతం సమయం ఇవ్వరా? అని పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.

అసెంబ్లీకి రాని నేతకు ఎల్ఓపీ ఎందుకు?

దాదాపు 20 నెలలుగా కేసీఆర్ బయటికు వచ్చి రాజకీయాలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతిపక్షనేతగా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల ప్రొటోకాల్ సేవలను అనుభవిస్తున్నారు. కానీ సభకు వచ్చి, చర్చల్లో పాల్గొనడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఓసారి అసెంబ్లీకి రావాలి కాబట్టి ఓ సారి బడ్జెట్ ప్రసంగం సమయంలో, మరోసారి గవర్నర్ స్పీచ్ టైంలో సభకు వచ్చి వెళ్లారు. ఆ మాత్రం దానికి కేసీఆర్‌‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు? ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వొచ్చు కదా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే విమర్శలు గుప్పించారు.

కవిత ఎపిసోడ్‌లో ఫెయిల్?

రాజకీయాల్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆయన్ను దగ్గరగా గమనించిన లీడర్లు చెబుతుంటారు. కానీ కవిత ఎపిసోడ్‌ను కంట్రోల్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలమైనట్టు విమర్శలున్నాయి. సొంత మనుషులు బయటకు వెళ్లి పార్టీపై విమర్శలు చేస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కవిత పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేసేందుకు సిద్ధమైన తొలి రోజుల్లోనే ఆయన సమస్యకు ఎందుకు పుల్‌స్టాప్ పెట్టలేదు? ఒకవేళ సమస్య పరిష్కారానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? అనే చర్చ జరుగుతున్నది. నిజంగా ఆయన మాటలను సొంత ఫ్యామిలీనే లెక్కచేయకపోతే, ఇక పార్టీ లీడర్లను ఎలా పట్టించుకుంటారు? లీడర్లు క్రమశిక్షణతో ఏం ఉంటారు? అనే ప్రశ్న కేడర్‌లో ఉంది. మొత్తానికి కవిత ఎపిసోడ్ పార్టీ గ్రాఫ్‌ను జీరో స్థాయికి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.

అనారోగ్యమే కారణమా?

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి, బయటకు వచ్చి రాజకీయాలపై స్పందించకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యల మూలంగానే ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వయస్సు 71 ఏళ్లు. ఆయనకు కిడ్నీలు సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైనప్పుడు తాను ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలను వివరించి, పబ్లిక్ హియరింగ్ వద్దని రిక్వెస్టు చేశారని గుర్తు చేస్తున్నారు. పలుమార్లు యశోద ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు.

Next Story