KCR: వాటిని కొనసాగించాలి.. పండగ పూట రేవంత్ సర్కార్ కు కేసీఆర్ కీలక సూచన

by Prasad Jukanti |   (  Updated:2025-01-13 06:57:58  IST  )

పండగ పూట రేవంత్ సర్కార్ కు కేసీఆర్ కీలక సూచన చేశారు.

KCR: వాటిని కొనసాగించాలి.. పండగ పూట రేవంత్ సర్కార్ కు కేసీఆర్ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేశామని రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి (Sankranti) వేడుకలకు వన్నె చేకూర్చినవారమవుతామని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందని దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి (Rythu Welfare Schemes) పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి.. రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటూ ప్రకృతిమాతను ఈ సందర్భంగా ప్రార్థించారు.

దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చాం:

ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం బీఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతికాలంలో సత్ఫలితాలనిచ్చిందని అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు పొందిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంతో నిండాలని, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని గుర్తు చేశారు.

Next Story