KCR, KTRలను గ్రామీణ, అర్బన్ ఓటర్లు ఆదరించలేదు.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఫాంహౌస్ వీడి ప్రజల్లోకి రావాలని, గత ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ఓటర్లు వారిని తిరస్కరించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

KCR, KTRలను గ్రామీణ, అర్బన్ ఓటర్లు ఆదరించలేదు.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ప్రగల్భాలు పలికినా ప్రజలు నమ్మరని, ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు భావించడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థానానికి కేటీఆర్ సరిపోరని, కేసీఆర్, కేటీఆర్‌లను గ్రామీణ ప్రజలు, అర్బన్ ఓటర్లు ఆదరించలేదని విమర్శించారు. "మీరు కలలు కంటున్న అధికారం ఎప్పటికీ రాదు. ఇప్పటికైనా కేసీఆర్ ఫాంహౌస్‌ను వీడి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలి, అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుంది" అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసినందునే సీఎం అయ్యారని, కేవలం మీటింగ్‌లలో తిట్టినా లేదా సోషల్ మీడియాలో ఫోకస్ అయినా అధికారం రాదని ఆయన స్పష్టం చేశారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చి గెలిపించామని, మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో తమ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడిన దుర్మార్గులు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ మేరకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడిన దుర్మార్గులు బీజేపీ, బీఆర్ఎస్ నేతలని, బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడిన మాధవరెడ్డికి మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో టికెట్ ఇచ్చి పోటీ చేయించారని ఆయన మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. 60.51 శాతం బీసీలకు, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 7.81 శాతం టికెట్లు ఇచ్చామని, మొత్తంగా 80 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అవకాశం కల్పించామని చెప్పారు. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లలో 41 శాతం బీసీలు ఎన్నికయ్యారని, 55 శాతానికి పైగా వార్డుల్లో బీసీలదే పైచేయి అని ఆయన వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని గమనించే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అనిల్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి బ్రాండ్..

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్‌ల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని, మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం టికెట్లు బీసీలకే ఇచ్చామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, రాహుల్ గాంధీ మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుసరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి బ్రాండ్ అని, ఈ పార్టీ మాత్రమే బీసీ నాయకత్వానికి రెడ్ కార్పెట్ వేసిందని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.

Next Story