కేటీఆర్‌తో విభేదాలపై కవిత క్లారిటీ.. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

‘బీఆర్ఎస్ పార్టీ నాది. కొత్త పార్టీ పెట్టను. పార్టీలో సమస్యలు ఉన్న మాట వాస్తవం, వాటిని పరిష్కరించుకుంటాం. దెయ్యాలను ఏరి పడేస్తేనే పార్టీకి మనుగడ.

కేటీఆర్‌తో విభేదాలపై కవిత క్లారిటీ.. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్
X

‘బీఆర్ఎస్ పార్టీ నాది. కొత్త పార్టీ పెట్టను. పార్టీలో సమస్యలు ఉన్న మాట వాస్తవం, వాటిని పరిష్కరించుకుంటాం. దెయ్యాలను ఏరి పడేస్తేనే పార్టీకి మనుగడ. జాగృతిని మరింత బలోపేతం చేస్తా. అన్ని నియోజకవర్గాల్లోనూ పునరుద్ధరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుంది. రామన్నతో ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ నేతల మద్దతు లేకనే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయా.. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానంటే మా డాడీ వద్దన్నారు. అందుకే ఎమ్మెల్సీ అయ్యా. మా పీఏ స్థాయి నలుగురు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. విచారణకు రమ్మని సిట్ నుంచి కాల్స్ వచ్చాయని వాళ్లు చెబితే వెళ్లమని చెప్పా.. కానీ, మళ్లీ కాల్స్ రాలేదు. కేసీఆర్ భోళా శంకరుడు. నా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తారని నేను అనుకోవట్లేదు. కిందిస్థాయి వాళ్లు చేసి ఉండొచ్చు. సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నా. భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతా.. అది పదేళ్లకో ఇరవై ఏళ్లకో.. ఎలాగైనా నెరవేర్చుకుంటా..’ అని ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత కీలక విషయాలు వెల్లడించారు. దిశ, తెలంగాణ బ్యూరో:

కొత్త పార్టీ పెట్టను.. బీఆర్ఎస్ నాదే..

‘బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను. ఆ పార్టీ ఎమ్మెల్సీని. దీన్ని వదిలి ఎక్కడిపోను’ అని కవిత పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, ఒకవేళ పెట్టాలనుకుంటే ఢంకా బజాయించి మరీ చెప్తానని తెలిపారు. గతంలో జాగృతి తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, అయితే, కేసీఆర్ ఆదేశాలతో కొంతమేరకు యాక్టివిటీస్ తగ్గించామని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఎక్కడా తగ్గేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా జాగృతిని ఇంతే బలంగా నడిపిస్తానని స్పష్టం చేశారు. జాగృతిని ఉద్యమ సంస్థగా బలోపేతం చేస్తానని, అన్ని నియోజకవర్గాల్లోనూ పునరుద్ధరిస్తామని తెలిపారు.

లేఖ లీక్ కావడం వల్లే హెడ్ లైన్స్ లోకి..

‘2006లో రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నో రకాల పరిస్థితులు చూశా. కానీ, ఈ నెల రోజులుగా వస్తున్న హెడ్‌లైన్స్‌‌ను ఊహించలేదు’ అని కవిత అన్నారు. పప్పాకు రాసిన లేఖ లీక్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. నాన్నకు చిన్నప్పటి నుంచే లేఖలు రాస్తుంటానని, చాలా సందర్భాల్లో తన అభిప్రాయాలను లేఖల ద్వారానే తెలియజేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు కొందరి వల్ల ఆ లేఖ లీక్ అయిందన్నారు. కోవర్టులను ఏరిపడేస్తేనే పార్టీకి మంచిదని చెప్పారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల వల్లే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని, ఆ దెయ్యాలను బయటకు పంపించకపోతే పార్టీ మనుగడకే కష్టమన్నారు. కొంత మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు తనపై లేని పోని ఆరోపణలు సృష్టించి విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా..

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నానని, పదకొండున్నరేళ్లుగా ఆవేదననలో ఉన్నానని కవిత చెప్పారు. ప్రధానంగా పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తున్నదని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించానని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రొటోకాల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, రాష్ట్రవ్యాప్తంగా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారని తెలిపారు. పరిధులు పెట్టారని, వాటిని తాను ఊహించలేదన్నారు. దీంతో జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. మొదటి నుంచీ పార్టీ సపోర్టు లేకుండా పోయిందన్నారు. పార్టీ తనకు వలయంగా నిలిస్తే అరెస్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చేవి కావన్నారు. తనపై ఈడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేశానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరానని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు కూడా పార్టీ తనకు సపోర్టు చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎవరూ తన వద్దకు రావొద్దంటూ ఆదేశాలిస్తున్నారని చెప్పారు. జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. ఎప్పటికైనా సీఎం అవుతా..

‘ప్రతి ఒక్కరికీ తమ వృత్తుల్లో ఎదగాలనే కోరిక ఉంటుంది. నాకు సైతం రాజకీయాల్లో సీఎం కావాలని ఉంది. పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా దీన్ని నెరవేర్చుకుంటా’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంపీగా చేసినప్పుడు తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తానని.. దాంతో తనకు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని కవిత చెప్పారు. నిజామాబాద్‌లో ఎంపీగా ఓడినప్పుడు మరల ఎంపీగా పోటీచేస్తానని కేసీఆర్‌కు చెప్పానని, కానీ జిల్లా్లో ఉండాలని చెప్పి తనకు ఎమ్మెల్సీ ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

నన్ను పావుగా వాడుకోవాలనుకున్న బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీని ఉసిగొల్పుతూ వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలను టార్గెట్ చేస్తున్నదని, వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదని కవిత పేర్కొన్నారు. తనను పావుగా చేసుకొని, కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేసి సౌత్‌లో పాగా వేయాలని యత్నించిందని ఆరోపించారు. ఆధారాల్లేని లిక్కర్ కేసులో తనను ఇరికించి ఆరు నెలలు జైలులో పెట్టారన్నారు. జైలు నుంచి విడుదల చేయాలంటే బీఆర్ఎస్‌ను బీజేపీలో మెర్జ్ చేయాలని ప్రస్తావన తీసుకొచ్చారని.. అయినా దానిని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆనాడే తాను ఆ ప్రపోజల్‌కు ఒప్పుకొని ఉంటే నేడు పార్టీ ఉండేది కాదన్నారు. పార్టీని నమ్ముకొని 75 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని.. వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. కేసీఆర్ తలదించుకునే పరిస్థితి రావొద్దని ఇలా చేశానని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వల్లే ఎంపీగా ఓటమి..

ఎంపీగా ఉన్నప్పుడు స్పెషల్ ఫండ్ కింద నిధులు కోరితే ఇవ్వలేదని, అందుకే అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని కవిత అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ స్థాయిలో నిజామాబాద్ ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు అడుగుతుంటే.. ఎంతో ఒత్తిడికి గురయ్యానన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి పలువురు పదేపదే అడ్డుతగిలారని, పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని ఒక్కోలా ప్రభావితం చేశారని చెప్పారు. తన పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. తాను మాత్రం ఎంపీగా ఓడిపోయానని, ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు. ఎమ్మెల్యేల సహకారం లేకనే తాను ఓడిపోయానని కవిత పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన తండ్రి కేసీఆర్‌కు చెబితే.. తన మీదే అరిచారని.. ఎమ్మెల్యేలను అంతలా నమ్మారని అన్నారు.

రామన్నతో విభేదాలు లేవు..

తనకు, అన్న రామన్నకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కవిత స్పష్టం చేశారు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నారు. ఎన్నోసార్లు రామన్నకు తాను.. తనకు రామన్న సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు. కాకుంటే.. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందన్నారు. తాను రాసిన లేఖ లీక్ తరువాతనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. పొలిటికల్‌గానే ఈ డిస్టెన్స్ తప్పితే.. ఫ్యామిలీ పరంగా కాదన్నారు. ఈ పరిణామాలతో ఆయన సైతం సంతోషంగా లేరని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, బీఆర్ఎస్‌కు ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు. అందరం ఈ సమయంలో ఆనందంగా ఉండాల్సి ఉండగా.. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక ఆందోళనలో ఉన్నామన్నారు. పార్టీ నుంచి కొందరిని బయటకు పంపించాల్సిన అవసరం ఉందని.. వారి వల్లే తమ ఫ్యామిలీకి సైతం కష్టాలు వచ్చాయని అన్నారు.

అదంతా ఫేక్ ప్రచారం..

ఇటీవల తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సందర్భంలో తాను వెళ్తే పట్టించుకోలేదన్న వార్తలో నిజం లేదని కవిత స్పష్టం చేశారు. పైకి వెళ్లి ఎప్పటిలాగే నాన్నను విష్ చేశానని.. ఆ తరువాత అమ్మతో కలిసి టిఫిన్ చేశానని చెప్పారు. తన భర్త అనిల్ కేసీఆర్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారన్నారు. పైన తమతో అయితే మీడియా లేదని.. కానీ ఈ వార్త ఎలా బయటకు వచ్చిందో అర్థం కాలేదన్నారు. తమ మధ్య విభేదాలు సృష్టించి.. బుల్డోజ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారందరికీ ఒక్కటే మాట చెబుతున్నానని.. తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని వెల్లడించారు.

నా సహచరులకు సిట్ నుంచి కాల్స్ వచ్చాయి

‘మా తండ్రి కేసీఆర్ భోళాశంకరుడు. నా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారని నేను అనుకోవట్లేదు. కానీ.. నా చుట్టుపక్కల ఉండే పీఏ స్థాయి వ్యక్తులు నలుగురికి సిట్ నుంచి ఫోన్లు వచ్చాయి. వారు వచ్చి నాకు చెప్పారు. విచారణకు పిలిస్తే వెళ్లండి అని నేను కూడా వారికి చెప్పాను. కానీ.. మళ్లీ వారికి ఫోన్లు కానీ నోటీసులు కానీ రాలేదు’ అని కవిత తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వినడానికే బాలేదని.. కేసీఆర్‌కు అంత అవసరం కూడా లేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story