Kavitha: మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ కీలక భేటీ!

by Prasad Jukanti |

కవిత యూఎస్ టూర్ కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Kavitha: మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత..  కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ కీలక  భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farm House) కు వెళ్లనున్నారు. మరి కాసేపట్లో తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఫామ్ హౌస్ లో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను కలవనున్నారు. కవిత తన కుమారుడిని అమెరికాలో గ్రాడ్యుయేషన్ లో చేర్పించబోతున్నారు. ఇందుకోసం ఆమె రేపు యూఎస్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి తాత ఆశీర్వాదం కోసం ఆమె ఫామ్ హౌస్ కు వస్తున్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యాక కవిత రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. ఆమె 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటన ముంగిచుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. కవిత అమెరికా పర్యటన కోసం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాస్ పోర్ట్ కూడా రిలీజ్ చేసింది.

ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీశ్ రావు సైతం!:

మరో వైపు ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao), జగదీస్ రెడ్డి, వినోద్ కుమార్ తో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడితో పాటు కవిత ఫామ్ హౌస్ కు వస్తున్న రోజే పార్టీ నేతలతో కేసీఆర్ ఈ భేటీ నిర్వహిస్తున్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత ఆరోపించడంతో పాటు పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిపై ఏ మాత్రం అవకాశం ఉన్నా పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఫామ్ హౌస్ కు వస్తున్న రోజే కీలక నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. గతంలో కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె అమెరికా టూర్ కు ముందే ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ లో ఏం జరగబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story