- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: పార్లమెంట్‌లో చట్టం చేసే వరకూ జాగృతి పోరాటం: కల్వకుంట్ల కవిత
బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేసే వరకూ తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల (BC Reservation) కోసం పార్లమెంటులో చట్టం చేసే వరకూ తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం తెలంగాణ జాగృతి కార్యాలయానికి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య (R Krishnaiah), వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, జాతీయ బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వచ్చారు. తెలంగాణ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొంటారని.. మద్దతు అడగకపోయినా బీసీల కోసం జాగృతి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ ఏర్పడిందని, తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశాయని అన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లో పుట్టి పోరాటం చేయడం కామన్ అని, కవిత బీసీల గురించి పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు.
ఆమెను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కవితకు బీసీల మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మొదలైన ఈ ఉద్యమం అన్ని రాష్ట్రాలకూ పాకాలన్నారు. వీజీఆర్ నారగోని మాట్లాడుతూ.. తెలంగాణలో రెండో దశ ఉద్యమం బీసీ ఉద్యమ రూపంలో ప్రారంభం అయిందని చెప్పారు. అన్ని పార్టీలు కట్టకట్టుకుని బీసీలను మోసం చేస్తున్నాయని, బీసీలకు రావాల్సిన హక్కులు, అజెండా మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. కవిత కొంతకాలంగా పూలే విగ్రహం గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారని, ఆమెలాగా అగ్రవర్గాల నేతలు బీసీల గురించి మాట్లాడాలని సూచించారు. కాగా.. బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కవిత శనివారం ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక..
తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నాయకులు చేరారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. జాగృతి నాయకులు గోపు సదానందం, పడాల మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శర్మన్, సురేశ్ రామారావు, సతీశ్, అనిల్, రాజు, బాలకృష్ణ, కృష్ణా నాయక్, రాములు తదితరులు జాగృతిలో చేరారు. కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులపై దాడులను ఆపాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ హుస్సేన్, నాయకులు నర్సింహా ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు గ్రామీణ వైద్యులు కవితను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికి పైగా గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తున్నామని.. అయినా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు తరచూ తమ హెల్త్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. కవిత స్పందిస్తూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయవద్దని, వారి సేవలకు తగిన గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు.






