Kavitha: అమరవీరులు, ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-25 06:27:30  IST  )

జాగృతి జనంబాట పర్యటనలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha:  అమరవీరులు, ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) క్షమాపణలు కోరారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న పదేళ్ల పాటు అమరవీరులు, ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని అందుకు మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇవాళ ఉదయం ‘జాగృతి జనం బాట’ (Jagriti Janam Bata) పేరుతో కవిత జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనకు ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం 1200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పామని వారి కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామన్నారు. 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జడ్పీటీసీ టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అనేక సందర్భాల్లో పార్టీ అంతర్గత వేదికలపై అడిగాననని చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నానన్నారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామన్నారు.

మళ్లీ కలిసి పనిచేద్దాం:

అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలనే ఉద్దేశంతో తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరుతున్నానని.. సామాజిక తెలంగాణ కోసం అంతా కలిసిరావాలని ప్రజలకు కవిత పిలుపునిచ్చారు. అందరి కోసం తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలన్నారు. అగ్రవర్ణాల్లో అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అన్ని వర్గాలు కలిసి ఉంటే తెలంగాణ బాగుంటుందన్నారు. ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తామని చెప్పారు. గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని కోరారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసివేశారు.తిరిగి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే దాకా పోరాటం చేద్దామని, ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ చేద్దాం పిలుపునిచ్చారు.

Read More..

కవిత ‘జనం బాట’ యాత్ర షురూ.. కాసేపట్లో అమరవీరుల స్తూపానికి నివాళులు

Next Story