Kummera incident : పసి బిడ్డ మృతిపై న్యాయ పోరాటం : కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన కవిత

by Ramesh Naini |

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుల వివక్షతో దాడి చేసి రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు.

Kummera incident : పసి బిడ్డ మృతిపై న్యాయ పోరాటం : కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుల వివక్షతో దాడి చేసి రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. శుక్రవారం బాధితురాలు మౌనిక, గణేశ్ తో కలిసి డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో కవిత మాట్లాడారు. నాగర్ కర్నూల్‌లోని కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ సంఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల చిన్నారి మరణానికి న్యాయం జరిగేలా సంఘటనకు కారణమైన వారికి శిక్ష పడేలా బాధిత కుటుంబం పోరాటం చేస్తోందని వారికి అండగా ఉంటామని వెల్లడించారు. ఒక సామాజిక కార్యకర్త, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ కూడా అండగా ఉన్నారన్నారు. పాప మరణానికి సంబంధించి పోలీసులు ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని ఈ సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయని తెలిపారు.

పోలీసులు, ప్రభుత్వం కలిసి నేరం చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. పాప తల్లి మౌనికకు, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 2026లో కుల వివక్షతో ఇంతటి దాష్టీకం జరగడం చూస్తుంటే ప్రజా పోరాటాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా చాలా సిగ్గు పడుతున్నా అని ఆమె తెలిపారు. కుల వివక్ష ఉండకుండా పరిస్థితి మారేందుకు ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను శిక్షించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story