- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రికి రాత్రే హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్
‘ఆంధ్రవాళ్ల కోసం ఈ ప్రభుత్వం తలవంచింది. ఆంధ్రోళ్లకు ఎట్ల ఉద్యోగాలు ఇస్తారన్న విషయాన్ని అందరూ గమనించాలి.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆంధ్రవాళ్ల కోసం ఈ ప్రభుత్వం తలవంచింది. ఆంధ్రోళ్లకు ఎట్ల ఉద్యోగాలు ఇస్తారన్న విషయాన్ని అందరూ గమనించాలి. గ్రూప్-1 ఉద్యోగాలు కచ్చితంగా అమ్ముకొని అవినీతికి పాల్పడ్డారు. ఇవ్వాళ కాకపోయిన సరే రేపు ఈ విషయం బయటపడుతుంది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి కవిత వెళ్లగా.. లోపలికి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకుల నినాదాలు చేశారు. లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు. గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో మాట ముచ్చట నిర్వహించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులతో ఈ ప్రభుత్వం తలపడుతున్నదని.. లక్షలు ఇచ్చి లాయర్లను తీసుకొచ్చి పేద విద్యార్థులపై ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనలో సైతం అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారని.. ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే తాను కోరుతున్నానని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నామని.. గ్రూప్ -1లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని తెలిపారు. ఈ ఎగ్జామ్‌ను రద్దు చేసి రీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్‌మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్‌మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకని నిలదీశారు. ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుందని అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. రాహుల్‌గాంధీ బిహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఆయన వెంటనే ఇక్కడకు రావాలని.. లేదంటే తాము బిహార్‌కు వస్తామని హెచ్చరించారు. కోర్టులో ఈ అంశంపై విచారణ ఉందని.. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరారు. తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు జరిగిందన్నారు. గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు సైతం ఉన్నారని.. అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారని.. ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదని అన్నారు. గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్‌లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్-1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి కవిత చాయ్ తాగారు. పోలీసులు పలువురు జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
యువతతోనే మార్పు సాధ్యం
సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గానీ.. స్వాతంత్ర్య ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర అని చెప్పారు. రాష్ట్రంలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని వెల్లడించారు.






