Kavitha: గుంట నక్కను గుడ్డిగా ఫాలో అయ్యారు.. కేటీఆర్‍పై కవిత ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |

హరీశ్ రావు, కేటీఆర్ పై కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Kavitha: గుంట నక్కను గుడ్డిగా ఫాలో అయ్యారు.. కేటీఆర్‍పై  కవిత ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హరీశ్ రావు, కేటీఆర్ పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంట నక్క ప్రెస్ మీట్ పెట్టారని, గుంట నక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా నమ్మి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత..ఈ వ్యవహారంలో పెద్ద తిమింగలం మెగాను కాపాడేందుకు హరీశ్ రావు పాట్లు పడుతున్నారని ఆరోపించారు. తిమింగలం లాంటి కాంట్రాక్టర్ కు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన చెందుతోందన్నారు. బీఆర్ఎస్ ఓబీసీలకు సైట్ విజిట్ విధానం లేదని సెటైర్ వేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు పెట్టారని, ఈ టెండర్ల అంశంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేపనే అన్నారు. పవర్ మినిస్టర్ భట్టికి లేఖ రాయడానికి బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు.

కార్తీకదీపం సీరియల్‌‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు:

ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ఘాటుగా విమర్శించారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ 'కార్తీకదీపం' సీరియల్‌ను తలపిస్తోందని, ప్రజల్లో ఇది హాస్యాస్పదంగా మారిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాలకు వాడటం సరికాదని, విచారణను సాగదీయకుండా వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

పార్టీ పేరుపై హింట్:

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే తాను అందుకు వ్యతిరేకమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను కాంగ్రెస్‌లో చేరను. అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది, అప్పుడు మహేష్ గౌడ్‌కు నా పార్టీలో కీలక పదవి ఇస్తా’’ అని అన్నారు. ఈ సందర్భంగా జాగృతి పార్టీ అంటూ సంబోధించడంతో కవిత స్థాపించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని ఉండబోతోందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story