Kavitha: తప్పించుకునేందుకు బుకాయింపా?.. రాష్ట్ర అప్పులపై వైట్ పేపర్ రీలీజ్ చేయాలి: కవిత

by Prasad Jukanti |   (  Updated:2025-03-10 06:37:48  IST  )

రాష్ట్ర అప్పులపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha: తప్పించుకునేందుకు బుకాయింపా?.. రాష్ట్ర అప్పులపై వైట్ పేపర్ రీలీజ్ చేయాలి: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్టను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ఉన్నతంగా ఉందని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తే అటువంటి రాష్ట్రాన్ని పట్టుకుని ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని దేశవ్యాప్తంగా మీడియా కథనాలు రాస్తోందని దీంతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ రూ.5,500 కోట్లు కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రతినెల 18,800 కోట్లు ప్రతినెల వస్తోంది. అందులో కచ్చితంగా వెచ్చించాల్సిన ఖర్చులు రూ.6000 కోట్లు. ఇవి పోతే ప్రతి నెల రూ.12,000 కోట్లు నికరంగా మిగులు ఉంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై (State Debts) శ్వేతపత్రం (White paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బేడీలు, కేసీఆర్ పై చాడీలు.. :

15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 లక్ష 50 వేల కోట్ల అప్పులు చేసిందని కవిత ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలతో పాటు అనేక వర్గాలకు 420 హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఇంత అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని నిలదీశారు. కేసీఆర్ చేసిన అప్పులపై విమర్శలు చేశారు. మా హయాంలో జరిగిన అప్పులు ఏం చేశామో మేము లెక్కలు చెప్తాం. మీరు ఈ డబ్బంతా ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ 15 నెలల్లో డబ్బులంతా బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం తప్ప పేదలకు ఓ ఒక్క మంచి పనిచేయలేదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో విలేకరి అడిగిన ప్రశ్నలకు తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి బుకాయించారని ఈ ప్రభుత్వం బుకాయింపులు, బెదిరింపులు, బేడీలు, కేసీఆర్ (KCR) పై చాడీలు చెప్పే ప్రభుత్వం అన్నారు. తెలంగాణను అవమానించవద్దని సీఎంను కోరారు.

Next Story