Kalvakuntla Kavitha : ‘కవిత ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు’

by Disha Web Desk 4 |
Kalvakuntla Kavitha : ‘కవిత ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని, ఆమె ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లుగా అధికారంలో ఉన్నారని, కానీ తమను ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి పథకాలు మనీ మేకింగ్ మిషన్స్‌లా తయారయ్యాయని ఆయన ఆరోపణలు చేశారు.

యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షాల కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు వారి కుటుంబాల కోసమే పనిచేస్తాయని ఘాటుగా విమర్శించారు. సేవ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సయ్యద్ జాఫర్ ఇస్లాం మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి, ఎన్నికల హామీలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి అందరికీ తెలుసని, రానున్న రోజుల్లో రేవంత్ బండారం బయట పెడతామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం వార్నింగ్ ఇచ్చారు.


Next Story