- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, రాజేంద్రనగర్ : పారిశ్రామిక వాడలో నిబంధనల ప్రకారం ఎలాంటి నివాస గృహాలను నిర్మించొద్దు. నిర్మిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఐఏఎల్ఎ (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ- ఐలా) అధికారులు పర్యవేక్షిస్తూ ఉక్కుపాదం మోపాలి. కానీ సంబంధిత శాఖ అధికారులు తమ బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల మధ్యలో నివాస గృహాలను నిర్మిస్తున్నారు. వీటిపై స్థానికులు ఎప్పటికప్పుడు ఐలా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి..
ఫిర్యాదులు వస్తే అధికారులకు పండగే..
పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇళ్లపై సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కొందరు ఇటీవల ఐలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల కాటేదాన్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇళ్ల యజమానులను కలిసి నోటీసులు ఇచ్చారు. కానీ తరువాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దర్జాగా ఆ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐలా అధికారులు, సిబ్బంది సంబంధిత ఇళ్ల యజమానులతో సెటిల్మెంట్లు చేసుకొని అందిన కాడికి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఐలా అధికారులకు ఫిర్యాదులు చేస్తే వారికి పండగే అని మండిపడుతున్నారు.
పదుల సంఖ్యలో నిర్మాణాలు
కాటేదాన్ పారిశ్రామిక వాడలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో నివాసిత ఇళ్ల నిర్మాణాలు దర్జాగా కొనసాగుతున్నాయి. కానీ ఐలా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఇళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాటేదాన్ పారిశ్రామిక వాడల్లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు 200 గజాలు, 300... 400 గజాల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఫిర్యాదులు వచ్చాయి.. చర్యలు తీసుకుంటాం -- కవిత, ఐలా అధికారి
కాటేదాన్ పారిశ్రామికవాడలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణంపై ఇటీవల ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.






