- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆడపిల్లల చదువు ఎంతో ప్రధానమైంది. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలంటే అమ్మాయిలు విద్యావంతులు కావడంతో ఎంతో ముఖ్యం. సమాజిక అసమానతలను రూపుమాపేందుకు ఇదెంతో దోహపడుతుంది. ఇదే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బాగాంధీ విద్యాల యాలను నిర్వహిస్తోంది. అయితే... ఆ పాఠశాలల్లో సౌకర్యాలకంటే సమస్యలే అధికంగా ఉంటున్నాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థినులను పట్టించు కొనే నాథుడే కరువయ్యాడు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం భీమ్ గల్ పట్టణంలో అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది.
ఆరో తరగతి నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియట్) వరకు ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతున్న ఈ స్కూల్ లో హైస్కూల్ సెక్షన్ లో 200 మంది, కాలేజీ సెక్షన్ లో 80మంది చదువుతున్నారు. ఇంటర్మీడియట్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపుల్లో బోధన జరుగుతోంది. ఊరికి దూరంగా భీమ్ గల్ నుంచి కుప్కల్ గ్రామానికి వెళ్‌లే బైపాస్ రోడ్డులో నిర్మించిన ఈ విద్యాలయం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం, బాలికల విద్యాలయం కావడం కొంతమేర భద్రత పరంగా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. స్కూల్ స్థాపించిన నాటి నుంచి 100 శాతం రిజల్ట్స్ తో చక్కని పనితీరును కనబరుస్తున్న విద్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకుని ఈ విద్యాలయంలో చదువు కుంటున్నట్లు విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ అనురాధ తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పరంగా, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించే విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ విద్యాలయంలో అసౌకర్యాలు విద్యార్థినులకు శాపంగా మారాయి. 280 మంది విద్యార్థినులు, దాదాపు 20 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటున్న ఈ స్కూల్ లో డైనింగ్ హాల్ లేకపోవడంతో విద్యార్థినులు ఎక్కడ పడితే కూర్చుని తినాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆరు బయట తింటుండగా కోతుల గుంపులు వచ్చి అందరినీ భయపెడుతుంటే తినే పళ్లాలు వదిలేసి విద్యార్థినులు భయంతో పరుగులు తీస్తున్నారు. దాదాపు 300 మంది కోసం వంట చేయాల్సిన వంట గది చాలా చిన్నగా ఇరుగ్గా ఉండటంతో వంట మహిళలు ఆ గదిలో నిలబడి పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. డైనింగ్ హాలు నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాగా, కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశాడు. టెక్నికల్ సమస్యతో పనులు ముందుక సాగడం లేదని కంట్రాక్టర్ చెపుతున్నట్లు స్పెషల్ ఆఫీసర్ అనురాధ అన్నారు.
పాఠశాల భవనం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించినప్పటికీ ఉండాల్సిన ఎత్తులో దాన్ని నిర్మించకపోవడంతో బాలికలకు అది ఏమాత్రం రక్షణగా లేకుండా పోయింది. చిన్నపిల్లలు సైతం గోడదూకి బయటి నుండి లోపలికి, లోపలినుండి బయటికి వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం కూడా హోం సిక్ కు గురైన ఓ విద్యార్థిని చెప్పా పెట్టకుండా గోడ దూకి బైటికి వెళ్లిపోగా వెంటనే గమనించిన సిబ్బంది ఆమెను తిరిగి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి వేళల్లో అందరూ బాలికలు, మహిళా సిబ్బందే ఉండే ఈ కస్తూర్భా గాంధీ విద్యాలయం ప్రహారీ గోడ ఎత్తుగా లేకపోవడంతో స్కూల్ లోని విద్యార్థినులు, స్టాఫ్ కూడా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడపాల్సిన దుస్థితి దాపురించింది. దీనికి తోడు స్కూల్ నుండి బైటికి వెళ్లాల్సిన నీటి కోసం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్కూల్ నుండి బయటకు వెళ్లే మురుగు నీరంతా రోడ్డుపైకి చేరి జనాలకు ఇబ్బందులు కలుగుతోంది. ఇలా ఒకటి కాదు రెండు ఎన్నో సమస్యలు భీమ్ గల్ కస్తూర్భా గాంధీ విద్యాలయాన్ని ముళ్ల కంచెలా చుట్టుకున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరమెంతైనా ఉంది.






