సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

by velandi.Saikiran |

మామిడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూమి, జాగా లేదంటూ స్నేహితుల బృందం చేసిన అవమానాలను

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
X

దిశ, కోనరావుపేట: మామిడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూమి, జాగా లేదంటూ స్నేహితుల బృందం చేసిన అవమానాలను తట్టుకోలేక గుమ్మడి బాబు (29) అనే యువకుడు తన భార్య కళ్ల ముందే సెల్ టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగా, గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మామిడిపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి బాబు (29) తన భార్య ప్రవళికతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం 9 గంటలకు కులేరు శీను అనే వ్యక్తి దావత్ ఇస్తున్నానని చెప్పి బాబును తనతో పాటు తీసుకెళ్లాడు.

దావత్ జరిగే క్రమంలో కులేరు శీను, గుమ్మడి వినయ్, కులేరు తిరుపతి, కల్లేట్ల తిరుపతి, కులేరు అజయ్, బోల్మాల్ రాకేష్, కూలేరు కిషన్ మొదలైన వారందరూ కలిసి బాబును అవ‌మానించారు. "నీ దగ్గర ఏముందిరా? నీ దగ్గర భూమి లేదు, జాగా లేదు, ఇంకా ఎందుకు ఉన్నావురా?" అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఈ అవమానాలను తట్టుకోలేకపోయిన బాబు, జీవితంపై విరక్తి చెంది, తన ఇంటి దగ్గర ఉన్న టవర్ ఎక్కాడు. కింద ఉన్న తన భార్య ప్రవళికకు జరిగిన సంఘటననంతా చెప్పి, అక్కడి నుంచే దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుమ్మడి ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనరావుపేట ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు. బాబు ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మామిడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

Next Story