నిబంధనలు పట్టవా..? రహదారి పక్కనే వైన్స్

by velandi.Saikiran |

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వైన్స్ అయితే 20 వేల జనాభా దాటి ఉంటే జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారికి 500 మీట

నిబంధనలు పట్టవా..? రహదారి పక్కనే వైన్స్
X

దిశ, తిమ్మాపూర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులను ఆనుకొని ఎట్టి పరిస్థితుల్లో వైన్స్ గాని, బార్లు గాని ఏర్పాటు చేయవద్దనే నిబంధనలు ఉన్నా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్లు కన్పిస్తుంది. తిమ్మాపూర్ లోని ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ప్రధాన రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసిన వైన్స్ నిబంధనలు పాటించక పోవడం పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇదేమి పట్టదన్నట్లు కాసుల మాటున మిన్నకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీఐ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే..

తిమ్మాపూర్​లోని రాజీవ్ రహదారికి ఎలాంటి డిస్టెన్స్ తో సంబంధం లేకుండా రహదారిని ఆనుకొని గత సంవత్సర కాలంగా వైన్స్ ను ఏర్పాటు చేసి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా వైన్స్ ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి కూత వేటు దూరంలోనే ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఉండడం గమనార్హం. నిబంధనలను తుంగలో తొక్కి ప్రధాన రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసిన వైన్స్ పై ఎక్సైజ్​అధికారులు మాత్రం కాసుల మాటున కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

తరుచూ ప్రమాదాలు.. గొడవలు

తిమ్మాపూర్ గ్రామ రాజీవ్ రహదారికి ఆనుకొని ఏర్పాటు చేసిన వైన్స్ వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో పాటు వైన్స్ సమీపంలో మందు బాబుల గొడవలు నిత్య కృత్యంగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రహదారిని అనుకొని సాగుతున్న వైన్స్ వల్ల మద్యం ప్రియులు ఫుటుగా తాగి పలుమార్లు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని అటుగా వెళ్లే వాహనదారులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్..

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వైన్స్ అయితే 20 వేల జనాభా దాటి ఉంటే జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. 20 వేల జనాభా లోపు ఉంటే విధిగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారికి 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైన్స్ కు మాత్రం ఈ నిబంధన వర్తించనట్లు ఉందని పలువురు వాహనదారులు, తిమ్మాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైన్స్ ను నిబంధనలకు అనుకూలంగా రాజీవ్ రహదారికి దూరంగా ఏర్పాటు చేయించాలని వాహనదారులు, తిమ్మాపూర్ ప్రజలు కోరుతున్నారు.

తిమ్మాపూర్ వైన్స్ కు ఆ నిబంధన వర్తించదు..

ఎక్సయిజ్ సీఐ సాయిబాబా..

కరీంనగర్ నగర పాలక సంస్థకు తిమ్మాపూర్ వైన్స్ అత్యంత సమీపంలో ఉండడంతో దానికి రహదారికి ఆనుకొని ఉండకూడదు అనే నిబంధన వర్తించదని తిమ్మాపూర్ ఎక్సైజ్​ సీఐ సాయిబాబా 'దిశ' కు తెలిపారు.

Next Story