యూరియా బాధలు ఎప్పటికి తీరేనో..? డీసీఎంఎస్​లో బారులు తీరిన రైతులు

by Nalla Sampath Reddy |

యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రంగా కలవర పెడుతుంది. ప్రతి యేటా మండల మండలంలోని సొసైటీల ద్వారా యూరియా ఎక్కువగా రైతులకు లభించేది. కానీ ఈ ఏడు సొసైటీలు యూరియా కోసం డీడీ చెల్లించి 40 రోజులైనా యూరియా రాకపోవడంతో రైతాంగం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది.

యూరియా బాధలు ఎప్పటికి తీరేనో..? డీసీఎంఎస్​లో బారులు తీరిన రైతులు
X

దిశ, ఇల్లంతకుంట : యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రంగా కలవర పెడుతుంది. ప్రతి యేటా మండల మండలంలోని సొసైటీల ద్వారా యూరియా ఎక్కువగా రైతులకు లభించేది. కానీ ఈ ఏడు సొసైటీలు యూరియా కోసం డీడీ చెల్లించి 40 రోజులైనా యూరియా రాకపోవడంతో రైతాంగం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది.. మొదట వచ్చినప్పటికీ తలా రెండు బస్తాలు ఇస్తే ఏం సరిపోతుంది అని రైతన్నలు వాపోతున్నారు. ఎకరం సాగు చేసిన వారికి గదే రెండు, పదెకరాలు సాగు చేసిన వారికి గదే రెండు బస్తాలూ ఇస్తే ఎట్లా సరిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు మొదలైనప్పుడు మొదలైన యూరియా తిప్పలు వరి ముదురుకు వచ్చిన తప్పడం లేదని దిగులు చెందుతున్నారు.

మండలానికి కావాల్సింది 3200 మెట్రిక్ టన్నులు

మండలంలో రైతులు వరి 24 వేల ఎకరాలు, ప్రత్తి 12 వేల ఎకరాలు సాగు చేశారు. ఈ సాగు చేసిన పంటల విస్తీర్ణానికి 3200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు మండలానికి 2300 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం ఇంకా 900 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది.

యూరియా కొరతతో రైతన్న ఇక్కట్లు..

యూరియా కొరత రైతన్నను తీవ్రంగా వేధిస్తోంది. ఇల్లంతకుంట మండలంలో ఇల్లంతకుంట, గాలిపెల్లి, పొత్తూరు, రేపాక, ముస్కాన్ పేట్, పెద్ద లింగాపూర్ సొసైటీల ద్వారా మరియు ఐఆర్ఎస్కే ఇల్లంతకుంట, ఐఆర్ఎస్ కె ముస్కాన్ పేట్, డీసీఎం ఎస్ గాలిపెల్లి, డీసీఎంఎస్ పొత్తూరు - 2, కందీకట్కూర్ మహిళ సమాఖ్య ద్వారా రైతులకు యూరియా పంపిణీ జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కేవలం డీసీఎం ఎస్‌ల ద్వారానే పంపిణీ నడుస్తోంది. కానీ రైతులు రాత్రనక, పగలనక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. కోడి కూత పొద్దుకే రైతులు క్యూ నిలబడుతున్నారు. యూరియా కోసం ఆడ, మగ తేడా లేకుండా గంటల తరబడి అన్నదాతలు కాళ్లు లాగుతున్న నిలబడాల్సి వస్తోంది. యూరియా బాధలు ఎప్పటికీ తీరేనో.. అని రైతన్నలు వాపోతున్నారు.

నాలుగు రోజుల్లో సరిపడా యూరియా వస్తుంది.. మోదుళ్ల సురేష్ రెడ్డి(మండల వ్యవసాయాధికారి)

నాలుగు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా వస్తోంది. రైతులు ఆందోళన చెందవద్దు. వరి 24 వేలు, ప్రత్తి 12 వేల ఎకరాలకు గాను సెప్టెంబర్ చివరి వరకు 3200 మెట్రిక్ టన్నులు అంచనా వేయడం జరిగింది. 2300 మెట్రిక్ టన్నులు ఇంతవరకు వచ్చింది. మిగతా బ్యాలెన్స్ ఈ నాలుగు రోజుల్లో వస్తుంది.

గంటల తరబడి క్యూలో నిలబడినాను- బట్టు సుధాకర్ (రైతు, గాలిపెల్లి)

నేను ఉదయం 7 గంటల నుంచి క్యూలో నిలబడిన.. ఆకలి, దూప అనకుండా క్యూలో ఉన్న. మధ్యాహ్నం అయిన ఇంకా నా లైన్ రాలేదు. 6 ఎకరాలు పత్తి, ఎకరం వరి, 4 ఎకరాలు మొక్క జొన్న వేసిన. నాకు ఒక్క బస్తా ఇస్తే ఏం జేసుకోవాలే. వరి ముదురుకు వచ్చింది. యూరియా దొరుకుత లేదు. పంట కరాబ్ ఆయెటట్లుంది యూరియా లేక. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మనిషికి ఒక్కటి బస్తా ఇస్తే ఎట్లా సరిపోతది. రైతులు వేసిన పంటలకు సరిపడా యూరియా ప్రభుత్వం ఇవ్వాలి.

Next Story