కలెక్టర్ సారు.. ఫీజులపై నియంత్రణ ఎక్కడ?

by Kodari Anjali |

ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై తల్లిదండ్రులు ఆందోళన చెందే సమయం రానే వచ్చేసింది.

కలెక్టర్ సారు.. ఫీజులపై నియంత్రణ ఎక్కడ?
X

దిశ, కమాన్ పూర్: కలెక్టర్ సారు.. ఫీజులపై నియంత్రణ ఎక్కడ? ఫస్ట్ క్లాస్‌కే రూ.22 వేలా? అంటూ ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించగా, కొన్ని చోట్ల ఫస్ట్ క్లాస్‌లో చేరే విద్యార్థులకు సైతం రూ.22 వేల వరకు ఫీజులు నిర్ణయించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఫీజుల భారం పెరుగుతున్నప్పటికీ, వాటిని నియంత్రించే సమర్థవంతమైన వ్యవస్థ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణపై..

మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్య కోసం భారీ మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా, ఇతర ఛార్జీల పేరుతో అదనపు భారం కూడా పడుతోందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రం తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు సంబంధించి నిర్దిష్ట విధానం అమల్లో ఉండటంతో అక్కడ తల్లిదండ్రులకు కొంత ఉపశమనం లభిస్తోందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు జిల్లా యంత్రాంగం స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్ జోక్యం చేసుకుని ఫీజుల వసూళ్లపై సమీక్ష నిర్వహించి, అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story