ప్రజావాణికి దిక్కేది? అర్జీ ఇచ్చి నెలన్నరైనా స్పందన కరువు

by Kodari Anjali |

"ప్రజా పాలన - ప్రజావాణి" అంటూ ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అర్జీలు ఇచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజావాణికి దిక్కేది? అర్జీ ఇచ్చి నెలన్నరైనా స్పందన కరువు
X

దిశ, జమ్మికుంట: "ప్రజా పాలన - ప్రజావాణి" అంటూ ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అర్జీలు ఇచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్జీలు తీసుకొని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారని, పైగా ఆటో కిరాయిలు తడిసి మోపెడవుతున్నాయని బాధితులు వాపోతున్నారు.

సమస్యపై ఒక నెల 15 రోజులు అయినా స్పందన లేదు

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు యాకూబ్, మునహర్ బీ. వీరి కొడుకు నెలనెలా ఇవ్వాల్సిన భత్యం ఇవ్వడం లేదు. 6 నెలలుగా భత్యం రాక తిండికి, మందులకు తిప్పలు పడుతున్నారు. దీంతో "మాకు సంబంధించిన భూమిని మళ్లీ మా పేరుపై రిజిస్ట్రేషన్ చేసి రక్షించండి" అని కోరుతూ మే 25న హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీసులో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అర్జీ నంబర్: DKARM25052600056. దీనికోసం వారు రూ.1000 ఆటో కిరాయి పెట్టుకొని ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లారు.

నెలన్నరైనా స్పందన లేదు..

అర్జీ ఇచ్చి నెల 5 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి స్పందించలేదు. దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధ దంపతులు 'దిశ' ప్రతినిధిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ప్రజావాణి లక్ష్యం నెరవేరుతోందా?

ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను 15-30 రోజుల్లో పరిష్కరించడం. కానీ నెలన్నరైనా అర్జీకి మోక్షం లేకపోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. నెలలుగా కొడుకు భత్యం ఇవ్వక, ప్రభుత్వ సాయం అందక వృద్ధ దంపతులు తిండికి, మందులకు ఇబ్బంది పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి తహసీల్దార్ ద్వారా విచారణ జరిపి భత్యం ఇప్పించాలి. ఫిర్యాదు చేయడానికి ₹1000 ఆటో కిరాయి పెట్టడం పేద వృద్ధులకు భారమే. పరిష్కారం లేకపోతే వారి నమ్మకం సన్నగిల్లుతుంది.

వృద్ధుల ఆవేదన...

"ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. సమస్యలతో వచ్చే ప్రజలకు పరిష్కార మార్గం చూపి విశ్వసనీయత నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజావాణిని రద్దు చేసి కార్యాలయాలు మూసుకోవడం మంచిది" అని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story