భూమి కోసం బెదిరింపులు.. ఆత్మహత్య యత్నం పేరిట ఎస్సైపై కక్ష..!

by Bhanu |

వారసత్వంగా వచ్చిన భూముల విషయంలో సంవత్సరాలుగా వేధింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు వేల్పుల సత్తవ్వ, అనిల్ కుమార్, రవీందర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి కోసం బెదిరింపులు.. ఆత్మహత్య యత్నం పేరిట ఎస్సైపై కక్ష..!
X

దిశ, తంగళ్లపల్లి : వారసత్వంగా వచ్చిన భూముల విషయంలో సంవత్సరాలుగా వేధింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు వేల్పుల సత్తవ్వ, అనిల్ కుమార్, రవీందర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం వారు మాట్లాడారు. 2014 నుండి గ్రామానికి చెందిన వేల్పుల కృష్ణతో భూమి వివాదం కొనసాగుతుందని, గతంలో దాడికి పాల్పడి జైలుశిక్షను అనుభవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో కొనసాగుతోందని తెలిపారు.

గ్రామ వీఆర్‌ఏగా పనిచేస్తున్న కృష్ణ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతుంటాడని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం, దరుసుగా వ్యవహరించడం అతని నైజమని పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన సత్తవ్వ, తండ్రి లేని అనిల్ కుమార్‌లను భూమిని పంచుకునే విషయంలో బెదిరిస్తున్నాడని, "మీ దిక్కున్న చోట చెప్పుకోండి" అంటూ రెచ్చగొడుతున్నాడని వాపోయారు.

ఎస్సైపై కుట్ర పన్నాడా..?

భూమి విషయంలో అక్రమంగా ఖనీలు వేశాడని ఫిర్యాదు చేయగా, తంగళ్లపల్లి ఎస్సై విచారించి కేసు నమోదు చేశాడని వారు తెలిపారు. దీనికి ప్రతీకారంగా కృష్ణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పురుగుల మందు తాగినట్లు నటిస్తూ డ్రామా ఆడినట్లు ఆరోపించారు. ఎస్సై తన విధులను సక్రమంగా నిర్వర్తించినందుకే ఈ కుట్ర పన్నాడని, నిజాయితీగా పనిచేసే అధికారిపై అనవసరంగా అబద్దాలు పుట్టిస్తున్నాడని పేర్కొన్నారు.

తమ బాధలను విన్న, అర్ధం చేసుకున్న ఎస్సైను బెదిరించడం చాలా దుర్మార్గమని, అటువంటి ఘటనలు జరుగుతుంటే తమకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని తల్లి కొడుకులు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story